నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచనపల్లి గ్రామంలో తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూచనపల్లికి చెందిన సంగాని రవి గల్ఫ్‌లో పని చేస్తుంటాడు. వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అన్న రాజుతో గొడవకు దిగి... దాడి పాల్పడ్డాడు. రవి తన అన్నపై దాడి చేసిన విషయమై సోన్ పోలీసులకు అతని తండ్రి సంగాని పెద్ద రాజన్న ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సాయంత్రం పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టగా... ఇంటికి వచ్చిన రవి తన తండ్రితో గొడవపడి అర్ధరాత్రి కొడవలి, బండరాయితో మోది హత్య చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్లనే రవి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గల్ఫ్ నుంచి వచ్చినప్పటి నుంచి గ్రామస్థులతో, కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడని స్థానికులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తన అన్న సంగాని రాజుతో గొడవకు దిగినట్లు పేర్కొన్నారు. రాజు తీవ్ర గాయాల పాలయ్యాడని వివరించారు. రాజన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు వచ్చిన పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. నిందితుడిని వదిలేయడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎందుకు వదిలేశారో చెప్పాలని... ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు