సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువకుడి వలలో పడి మరో యువతి మోసపోయింది. ఫేస్‌బుక్‌లో పరిచయమై పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ ప్రబుద్ధుడు మాయ మాటలు చెప్పి ఆ యువతి నుంచి డబ్బులు కాజేశాడు. దీంతో బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ లాడ్జీలో బెంగళూరుకు చెందిన యువతి(26).. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు మదనపల్లెకు చెందిన అబీద్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు.. ఆమె వద్ద నుంచి రూ.3 లక్షల వరకు నగదు తీసుకున్నాడు.
ఆ తర్వాత నుంచి యువకుడు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన యువతి ఈ నెల 12న మదనపల్లెకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయినప్పటికీ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి బెంగళూరు వెళ్లిపోయింది. మరోసారి మదనపల్లెకు వచ్చిన యువతి.. పోలీసులు సైతం కేసును పక్కకు పెట్టేశారని తెలుసుకొని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అనంతరం తాను ఉంటున్న లాడ్జీకి వెళ్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన లాడ్జీ సిబ్బంది యువతిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: Facebook fake account: ఫేస్‌బుక్‌లో ప్రొఫెసర్ అసభ్యకర పోస్టులు.. చివరికి...