శుభకార్యం కోసం గోదావరి తల్లి చెంతకు వెళ్లారు. నదిలో అందరూ కలిసి స్నానం చేశారు. కొందరు మాత్రం కాసేపు నీటిలో ఆడుకుందామనుకున్నారు. ఇటీవలే పెళ్లి కుదిరిన యువకుడు..కాబోయే భార్యతో నీటిలో సరాదాగా అల్లరి చేస్తున్నాడు. ఇంతలోనే ఇద్దరు పిల్లలు జారి నదిలో కొట్టుకుపోయారు. కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు గల్లంతయ్యారు. వీరి వెంట వెళ్లి మరో ఇద్దరు ప్రవాహంలో చిక్కుకున్నారు. 5 నిమిషాలు ఆనందంగా గడుపుదామనుకున్న ఏడుగురిలో....క్షణాల్లోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద జరిగిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పుట్టు వెంట్రుకల కోసం.
మాక్లూర్ మండలం గుత్పకు చెందిన నరేశ్ కుమారుడి పుట్టు వెంట్రుకల కోసం... బంధువులతో కలిసి పోచంపాడ్‌లోని గోదావరికి వెళ్లారు. స్నానం చేసేందుకు అందరూ గోదావరి నదిలోకి దిగి.... ఒడ్డుకు చేరారు. కొంతమంది మాత్రం మరో 5 నిమిషాలు స్నానం చేద్దామనుకున్నారు. ఇంతలో ఇద్దరు పిల్లలు నదిలో జారి కొట్టుకుపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో మొత్తం ఏడుగురు నీటిలో గల్లంతయ్యారు. స్థానికులు అప్రమత్తమై ఒక బాలుడిని కాపాడగా..... మిగతా ఏడుగురూ విగతజీవులుగా బయటపడ్డారు.
నీటిలో ఆడుతున్న సమయంలోనే ప్రమాదం
మృతిచెందినవారిలో నిజామాబాద్ ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీనివాస్... ఆయన కుమారులు 14ఏళ్ల శ్రీకర్, 16 ఏళ్ల సిద్ధార్థ్ ఉన్నారు. మాక్లూర్ మండలం గుత్ప వాసి రాజు, నందిపేట మండలం డీకంపల్లికి చెందిన తండ్రీ కుమారులు సురేశ్, యోగేశ్‌లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రాజుకు ఇటీవలే వివాహం నిశ్చయం కాగా....జూన్ 4న పెళ్లి జరగాల్సి ఉంది. కాబోయే భార్యతో రాజు సరాదాగా నీటిలో ఆడుతున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని.... ప్రాణాలతో బయటపడిన బాలుడి తండ్రి పోశెట్టి చెప్పారు. మృతదేహాలకు బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.... కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన పట్ల సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న గవర్నర్ తమిళిసై