రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్ అసద్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు. ఎంఐఎం నాయకుడు అసద్‌ఖాన్(45), అంజద్ ఖాన్ మిత్రులు. తమ స్నేహాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలనుకున్న అసద్ తన కుమార్తెను, స్నేహితుడి కుమారుడికిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. తర్వాత కొంతకాలానికి కూతురు, అల్లుడు మధ్య మనస్పర్థలొచ్చాయి. అమ్మాయి పుట్టింటికొచ్చేసింది.
దంపతుల మధ్య గొడవలకు తన మిత్రుడే కారణమని భావించిన అసద్ అతనిపై పగ పెంచుకున్నాడు. 2018లో శాస్త్రిపురంలోని వెల్డింగ్ షాప్‌లో ఒంటరిగా ఉన్న అంజాద్‌ఖాన్‌పై మరో అయిదుగురితో కలిసి దాడిచేశాడు. అత్యంత దారుణంగా సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటనలో అతను అరెస్టయి, జైలుకు వెళ్లాడు. కొంతకాలం క్రితం జైలు నుంచి బయటికొచ్చాడు. అతనిపై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు.
అప్పట్నుంచి అంజద్ కుమారులు అదునుకోసం ఎదురుచూస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంలో మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలోని నైస్‌హోటల్ మీదుగా వట్టెపల్లి వైపు వెళ్తున్న అసద్‌ను అంజద్ కుమారుడు హత్య చేశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు శంషాబాద్ డీసీపీ ఈ కేసు వివరాలను వెల్లడించనున్నారు.
- ఇదీ చదవండి : వేట కొడవళ్లు.. 50కి పైగా కత్తిపోట్లు