Sister Poured hot oil on sibling: ఆ ఇద్దరు అక్కాచెల్లెలు అందరిలాగానే ఒకరికొకరు ఆప్యాయంగా ఉండేవారు. కష్టసుఖాలు చెప్పుకొంటూ ఒకరికొకరు తోడుగా నిలిచేవారు. కానీ గత కొంతకాలంగా వారిద్దరి మధ్య ఆ బంధం సన్నగిల్లింది. చెల్లెలు అక్కతో ముభావంగా ఉండటం మొదలుపెట్టింది. కదిలిస్తేనే మాట్లాడేది. ఏదైనా అడిగితే సమాధానం చెప్పి ఊరుకునేది. ఏం జరిగిందో అర్థం కాని అక్క.. తర్వాత తనే మాట్లాడుతుందిలే అని సర్దుకుపోయింది. ఇలాగే రోజులు గడుస్తుండగా వారిద్దరి మధ్య బంధం మరింత బలహీనపడింది. గొడవలకు దారితీసింది.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గాఢ నిద్రలో ఉన్న అక్క ముఖంపై.. ఒక్కసారిగా మరుగుతున్న నూనె పడింది. హఠాత్పరిణామానికి గురైన బాధితురాలు తీవ్రగాయాలపాలై కేకలు వేయడంతో.. తల్లి, ఇరుగుపొరుగు ఏం జరిగిందో అంటూ లోపలికి పరిగెత్తుకొచ్చారు. ఆమె పరిస్థితి చూసి భయపడిపోయి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇంతకీ ఆ నూనె పోసింది ఎవరంటే..
తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి.. అక్కతో కూడా చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక అక్కపై చెల్లి కాగుతున్న నూనెను పోసింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. అశోక్ నగర్ కాలనీలో నివాసముండే షేక్ చాందిని, నాగూర్ బీన్లు అక్కచెల్లెలు. ఇదివరకే ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. తమ తమ భర్తలతో గొడవల కారణంగా ఎవరికివారు వేరువేరుగా నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పుట్టింట్లోనే ఉంటున్నారు.
కొద్దిరోజులుగా చాందినికి శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి చనువుగా ఉంటోంది. చెల్లెలు నాగూర్ బీ కూడా శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉండేది. ఆ వ్యక్తి తన అక్కతో కూడా మాట్లాడుతుండటంతో నాగూర్ బీ జీర్ణించుకోలేకపోయింది. ఇదేంటని శ్రీనివాస్‌ను నిలదీసింది నాగూర్ బీ.. దానికి అతను చెప్పిన సమాధానం. "నాకు మీ అక్క కూడా కావాలి. మీ అక్క లేనప్పుడు నాకు నువ్వు అవసరం లేదు అన్నాడు. ఇద్దరినీ నేను పోషిస్తాను." అని అన్నాడు.
శ్రీనివాస్ మాటలకు కోపోద్రిక్తురాలైన నాగూర్‌బీ ఎలాగైనా చాందినిని వదిలించుకోవాలని చూసింది. అందుకే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకుంది. సమయం కోసం చూసి.. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వేడివేడి నూనెను చాందినిపై పోసింది. వేడినూనె పడటంతో చాందినికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లి, స్థానికులు వెంటనే బాధితురాలిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కారులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ ఎలా తప్పించుకున్నారంటే?