రొయ్యల వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అచ్యుతాపురం సమీపంలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కోదండ రామారావు(39) దమ్మపేట-అశ్వారావుపేట మండలాల సరిహద్దులోని మామిడి తోటలో శవమై తేలాడు. ఈనెల 12న తన భర్త కనిపించడం లేదంటూ మృతుని భార్య లీలాకుమారి పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం అచ్యుతాపురం సమీపంలోని జీడి మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు అశ్వరావుపేట సీఐ ఉపేంద్రరావుకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని భీమవరం సీఐకి తెలుపగా వారు కోదండ రామారావు భార్య కుటుంబ సభ్యులను తీసుకుని ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహం తన భర్తదేనని అతని భార్య నిర్ధారించారు. రొయ్యల వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న వారే తన భర్తను కడతేర్చారని మృతుని భార్య ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భీమవరం రెండో పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపారు.