రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ గుట్కా, పొగాకు సంబంధించిన అక్రమ రవాణా, వ్యాపారం జరుగుతూనే ఉంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని నాందేడ్ కేంద్రంగా గుట్కా, పొగాకు అక్రమ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో గుట్కాను నియంత్రించేందుకు హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
అదుపులో 32 మంది
పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గుట్కాకు రవాణా క్రయ విక్రయాలకు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సౌత్, ఈస్ట్ జోన్ పోలీసులు... 31 కేసులకు సంబంధించి మొత్తం 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.30,18,000 విలువైన నిషేధిత గుట్కా, పాగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. గురువారం నాడు ముందస్తు సమాచారం మేరకు సౌత్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం... రెండు కేసుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. మొదటి కేసులో బండ్లగూడకు చెందిన అబూబకర్ అలియాస్ జుమాలీని, రెండో కేసులో బార్కాస్‌కు చెందిన అబూబకర్, ఓమర్ బిన్ అలీలను అరెస్టు చేశారు. వారి ముగ్గురి దగ్గరి నుంచే మొత్తం 10 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
70 లక్షల సరకు సీజ్
ఇవాళ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ బృందం బేగం బజార్‌లోని షాహినత్ గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుట్కా రవాణాకు సంబంధించి... ట్రాప్ వేసి రాజస్థాన్‌కు చెందిన ఓ లారీని పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.70 లక్షల విలువైన పొగాకు, సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. స్వాగత్ గోల్డ్, హన్స్, జేకేఆర్ తదితర బ్రాండ్లతో పొగాకు అమ్ముతున్నారని మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు.
కొన్నాళ్లుగా ఇదే తంతు
ఉత్తరాఖండ్‌కు చెందిన నవ భారత్ ట్రాన్స్ ఫోర్ట్స్ యజమాని ప్రతాప్ కుమార్ బాస్కర్... అదే కంపెనీలో లోడింగ్, అన్ లోడింగ్ ఇంఛార్జిగా పనిచేస్తోన్న బీదర్‌కు చెందిన అమిత్ అనిల్ యాదవ్... గోడౌన్ ఇంఛార్జీగా ఉన్న బీదర్ స్వస్థలి అయిన మోహన్ రగోబా షోడోలేను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా గత కొన్ని ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారని పోలీసులు పేర్కొన్నారు.
అప్రమత్తంగా పోలీసులు
కరోనా సమయంలో కొంతమంది నేరస్థులు అదును చూసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలుకు ఉపయోగించుకున్నారని... హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్(CP Anjani kumar) స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను గుట్కా, పేకాట, మట్కా, క్లబ్బుల్లో గ్యాంబ్లింగ్ లేని నగరంగా తీర్చిదిద్దాలన్నది ప్రాధాన్యంగా తీసుకున్నామని సీపీ అన్నారు. టాస్క్‌ఫోర్స్ నుంచి 24 గంటల పాటు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజల నుంచి మంచి కో ఆపరేషన్ ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాల్లో సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలపాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: Rape: 8 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!