Cars Thief Arrest: హైదరాబాద్‌లోని చైతన్యపురి పీఎస్ పరిధిలోని రెండు నెలల క్రితం ఓ కారు చోరికి గురైంది. కార్లు అద్దెకు ఇచ్చే జూమ్ కార్స్ కార్యాలయానికి వచ్చిన ఓ యువకుడు క్రెటా కారును అద్దెకు తీసుకున్నాడు. నిర్వాహకులు అడిగిన ద్రువపత్రాలతో పాటు అడ్వాన్సు కూడా చెల్లించాడు. రెండు రోజుల అద్దెకు తీసుకెళ్లిన యువకుడు వారం గడిచిన తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. అనుమానం వచ్చిన సిబంది వెంటనే పైఅధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వాళ్ల సూచన మేరకు చైతన్యపురి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
పలు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 కేసులు..
చోరీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఏపీలోని భీమవరంకు చెందిన మహేష్ కుమార్‌గా గుర్తించారు. దర్యాప్తు చేసి మహేష్‌కుమార్‌తో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 ఖరీదైన కార్లతో పాటు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. మహేష్‌పై ఏపీ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబంగ, ఒడిశాలో కలిపి మొత్తం 16 కేసులున్నట్లు సీపీ తెలిపారు.
ఫోన్లతో మొదలుపెట్టి కార్ల దాకా..
భీమవరం మండలం చిన్నమిరంకు చెందిన మహేష్‌కుమార్.. ఆరేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో భీమవరంలో మొబైల్ దుకాణంలో పనిచేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలని చరవాణిలు చోరీ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి సరూర్‌నగర్‌లోని ఓ మొబైల్ షోరూంలో పనికి కుదిరాడు. అందులో చరవాణిలో చోరీ చేసిన విషయం బయటపడడంతో మలక్‌పేట పోలీసులు 2016లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన మహేష్.. ఈసారి కార్లు దొంగలించడం మొదలుపెట్టాడు. ఇందుకోసం కార్లు అద్దెకు ఇచ్చే సంస్థలను ఎంచుకున్నాడు.
వేరేవాళ్ల గుర్తింపు కార్టులతో..
ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ తోటి వాళ్ల ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, పాన్‌కార్డులను వాళ్లకు తెలియకుండా తీసుకునేవాడు. వాటిని ఇచ్చి.. అడిగిన అడ్వాన్సు కూడా చెల్లించి కార్లు అద్దెకు తీసుకునేవాడు. డ్రైవర్లు కావాలంటూ ప్రకటనలు ఇచ్చి డ్రైవింగ్ ఉద్యోగాల కోసం వచ్చే వాళ్ల నుంచి ఆధార్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వాటిని కూడా ఇందుకోసం వాడుకునేవాడు. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబంగాలో కూడా కార్లు దొంగిలించాడు. ఇలా దొంగిలించిన కార్ల జీపీఎస్, నెంబర్ ప్లేట్లు తొలగించి.. తన స్నేహితులైన మహ్మద్, హుస్సేన్ సహకారంతో విక్రయించాడు. వీళ్లు కూడా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందినవాళ్లు.
సాంకేతికత పెంచుకోవాల్సి ఉంది..
మహేష్ కుమార్‌ను మాదాపూర్ పోలీసులు గతేడాది మార్చిలో అరెస్ట్ చేసి ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. జైలుకు వెళ్లిన మహేష్ బెయిల్‌పై బయటికి వచ్చి మరోసారి అదే తరహా మోసాలకు పాల్పడుతున్నాడు. మహేష్‌పై సైబర్ నేరాలు కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కార్లు అద్దెకిచ్చే నిర్వాహకులు సైతం సాంకేతికతను పెంపొందించుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: