వరంగల్ జిల్లాలోని పర్వతగిరి గ్రామానికి చెందిన తేళ్ల భానుచందర్(24) డ్యాన్సర్. అదే గ్రామంలో ఉంటున్న..తనకంటే రెండేళ్లు పెద్దదైన మేనమామ కుమార్తె స్వర్ణలతను ప్రేమించాడు. యువతి తరఫు వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో గతేడాది మార్చి 10న గుడిలో పెళ్లి చేసుకున్నారు. యువకుడికి ఆస్తి లేదన్న కారణంతో అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. ఇద్దర్నీ దూరం పెట్టారు. ఆమెను సనత్‌నగర్‌లోని సోదరి ఇంట్లో ఉంచారు. పెళ్లయి నెలలు గడుస్తున్నా భర్తతో కలిసి జీవించే అవకాశంలేకపోవడం, పెద్దవాళ్లు అంగీకరిస్తారనే నమ్మకం సన్నగిల్లిన క్రమంలో యువతి జనవరి 5న ఆత్మహత్య చేసుకుంది. స్వర్ణలత ఆత్మహత్యకు భర్తే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. భానుచందర్‌పై పోలీసులు వరకట్న వేధింపులు సహా పలు సెక్షన్‌ల కింద కేసు నమోదుచేసి జనవరి 24న సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి రిమాండ్ ఖైదీగా తరలించారు. అక్కడే సోమవారం ఉదయం 6 గంటల సమయంలో అతను స్నానాల గదిలో దుప్పటితో వెంటిలేటర్ చువ్వలకు ఉరేసుకున్నాడు. భార్య తరఫు వాళ్లే తమ కుమారుడి చావుకు కారణమయ్యారని మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంగారెడ్డి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమ లేని లోకంలో.. ఉండలేక శోకంతో
తన చావుకు ఎవరూ కారణం కాదని, ఎవర్నీ ఇబ్బంది పెట్టొద్దంటూ 14 పేజీల సూసైడ్ లేఖలో బాధితుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ‘నా భార్య చనిపోవడానికి ముందు కూడా నాతో వీడియోకాల్‌లో మాట్లాడింది. నాతో కలిసి నూరేళ్లు బతకాలనే కోరికను వెలిబుచ్చింది. ఆమెతో కలిసి ఉండలేకపోయాననే బాధ, ఆమె మరణానికి పరోక్షంగా కారణమయ్యాననే ఆవేదన నన్ను అనుక్షణం బాధిస్తోంది. నాకు భూమి, డబ్బు లేదంటూ తరచూ నా భార్య కుటుంబ సభ్యులు అనే మాటలు వింటే నరకంలో ఉన్నట్లు అనిపించేది. పిల్లల్ని కనడం చంపుకోవడానికి కాదనే విషయాన్ని పెద్దలు గుర్తెరగాలి. ఈ భూమిపై వాళ్లు సంతోషంగా ఉంటే చాలనుకోవాలి. అలా అనుకోని.. ప్రేమలేని లోకంలో ఉండలేక చనిపోతున్నా’నంటూ లేఖలో పేర్కొన్నారు.