Punjab Drugs in hyderabad: ఓవైపు గోవా డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుండగానే.. పంజాబ్ నుంచి డ్రగ్స్ తరలిస్తున్న మరో ముఠా పట్టుబడి ఆందోళన రేకెత్తిస్తోంది. ఇద్దరు అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల విక్రేతలను రాచకొండ మాల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పాపిస్ట్రా కాన్సన్‌ట్రేట్, కాంట్రాబ్యాండ్, లక్షా 44 వేల నగదుతో పాటు కారు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను పంజాబ్ నుంచి కారులో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా... కీసర- షామీర్‌పేట్ మార్గంలో నిర్వహిస్తున్న పోలీసుల తనిఖీల్లో వీరిద్దరు పట్టుబడ్డారు.
పంజాబ్‌కు చెందిన జగ్తర్ సింగ్, జైమాల్ సింగ్ కలిసి.. కండ్లకోయ టోల్‌ప్లాజా సమీపంలో సందీప్ దాబా నిర్వహిస్తున్నారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్‌ను.. దాబాలో ఒకటీరెండు గ్రాముల ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. పంజాబ్‌లో ఒక గ్రామును 300 రూపాయలకు కొనుగోలు చేసి... హైదరాబాద్‌లో 700కు విక్రయిస్తున్నట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. దాబా కేంద్రంగా చేసుకొని కొనసాగిస్తున్న ఈ దందాలో.. మరో నిందితుడు రంజిత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు మత్తుపదార్థాలను తరలించడం రాష్ట్రంలోనే ఇది తొలి కేసని సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. నిందితులు ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తున్నారు..? ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారు..? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
"పంజాబ్‌కు చెందిన జగ్తార్ సింగ్ అనే వ్యక్తి కండ్లకోయ దగ్గర సందీప్ దాబాను నడిపిస్తున్నాడు. జైమాల్ సింగ్ అనే వ్యక్తి ఆ దాబాలో పని చేస్తున్నారు. వీళ్లకు ఓ లారీ డ్రైవర్.. పంజాబ్ నుంచి డ్రగ్స్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఒ గ్రాము డ్రగ్స్ ప్యాకెట్‌ను రూ. 330కు కొని రూ.700కు అమ్ముతున్నారు. పంజాబ్‌లో మాదకద్రవ్యాల వ్యవహారం ఎప్పటి నుంచో ఎక్కువగా ఉంది. దానిపై ఉడ్తా పంజాబ్ అనే సినిమా కూడా వచ్చింది. అక్కడ దాని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే మన రాష్ట్రానికి పంజాబ్ నుంచి డ్రగ్స్ రావటం బహుశా ఇదే మొదటి సారి." - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
డ్రగ్స్ సరఫరా ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. నార్కోటిక్స్ డ్రగ్స్‌ను అరికట్టేందుకు దేశంలో బలమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు. అక్రమరవాణా చేస్తున్నవారిపై పీడీ చట్టం ప్రయోగిస్తామన్నారు. కొన్ని కేసులో మరణశిక్ష కూడా ఉందని మహేష్ భగవత్ వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో 233 కేసులు నమోదు చేసి.. 10వేల 567 కిలోల గంజాయి.. ఆరున్నర లీటర్ల లిక్విడ్ గంజాయి, నాలుగున్నర లీటర్ల హాశిశ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితులను ఎవరినీ విడిచి పెట్టేది లేదని.. కచ్చితంగా శిక్షలు విధిస్తామని సీపీ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: