ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్(private bus driver), క్లీనర్ ప్రయాణికులను నిలువు దోపిడీ చేశారు. సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన బాధ్యతను విస్మరించి.. మధ్యలోనే వదిలి వాళ్ల సామాన్లతో ఉడాయించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేరళ నుంచి అస్సాంకు 65 మంది ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తోంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద అల్పాహారం కోసం ఆపారు. ప్రయాణికులు అందరూ కిందకు దిగగానే డ్రైవర్, క్లీనర్ లగేజీతో ఉడాయించారు.
ఫంక్షన్ హాలులో బస
ప్రయాణికులు బిహార్, బెంగాల్, నేపాల్, అసోంకు చెందిన వలస కూలీలు. కేరళలో పనులు చేసుకొని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏజెంట్ ద్వారా ఒక్కొక్కరు రూ.3,500 చెల్లించినట్లు బాధితులు తెలిపారు. ఈనెల 3 తారీఖున కేరళ నుంచి బయల్దేరినట్లు చెప్పారు. బస్సులో సామాన్లు, డబ్బులు పోవడంతో నార్కట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని పోలీసులు తెలిపారు. బస్సుకు జీపీఎస్ ట్రాకర్ లేదని వెల్లడించారు. బాధితులకు తాత్కాలికంగా నార్కట్‌పల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో రాత్రి బసకు ఏర్పాట్లు చేశారు. బస్ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు..
ఎమ్మెల్యే సాయం
బస్సు డ్రైవర్ ఘరానా మోసంతో నార్కట్‌పల్లిలో చిక్కుకుపోయిన 65 మంది వలస కూలీలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అండగా నిలిచారు. స్థానిక ఎస్సైతో మాట్లాడి బాధితుల బసకు ఏర్పాట్లు చేయించిన ఎమ్మెల్యే... ఇవాళ ఉదయం వారితో మాట్లాడారు. సంఘటనా తీరుపై ఆయన ఆరా తీశారు. బాధితులకు భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వారికి అవసరమైన రవాణా ఏర్పాట్లను చేయించి... అండగా నిలిచారు. ఎమ్మెల్యే సాయం పట్ల వలసకూలీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: Cyber Crime: గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేస్తే..