హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన పావని(22)కి గతేడాది ఆగస్టులో ఏపీలోని ఏలూరుకు చెందిన తిరుమల్‌రావుతో వివాహం జరిగింది. భర్త వ్యవసాయం చేస్తారు. పురిటి కోసం పుట్టింటికి వచ్చింది. ఇటీవలే ఎనిమిది నెలలు నిండడంతో తల్లిదండ్రులు జోగారావు, నీలవేణిలు పావనిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. అందులో భాగంగానే గురువారం తన సోదరితో కలిసి దవాఖానాకు వెళ్లగా అక్కడ కడుపులో ఉమ్మనీరు తక్కువుందని సెలైన్ ఎక్కించి పంపించేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయాసం మొదలైంది. వెంటనే తల్లి అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొవిడ్ అయి ఉండొచ్చన్న అనుమానంతో అక్కడ చికిత్స చేయమని చెప్పారు. ఎప్పుడూ ఇక్కడికే వస్తున్నామని.. వైద్యం చేయాలని తల్లి వేడుకున్నా ఫలితం లేకపోయింది. దిక్కుతోచని స్థితిలో అంబులెన్సులో మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి.
బిడ్డయినా బతుకుతుందని..
తర్వాత లక్డీకాపూల్‌లోని ఓ దవాఖానాకు చేరుకున్నారు. తమవద్ద వెంటిలేటర్ లేదని వారు చేర్చుకోలేదు. ఎల్‌బీనగర్‌లోని మరో ఆసుపత్రికి సిఫార్సు చేశారు. వారు మరో హాస్పిటల్‌కు పంపించారు. అక్కడికి తీసుకెళ్లాక మొదటి ఫ్లోర్‌లో చేర్చుకుని ఇక బతకడం కష్టం.. గాంధీకి గానీ, కోఠి ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో బిడ్డయినా బతుకుతుందని పంపించేశారు. కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగానే పావని కన్నుమూసింది. ఉదయం 11.30 గంటలకు అక్కడికి చేరగా.. అంబులెన్సులోనే పరీక్షించిన వైద్యురాలు తల్లీబిడ్డా ఇద్దరూ మృతిచెందినట్లు నిర్ధారించారు. పొద్దున్నుంచి ఇద్దరినీ కాపాడుకునేందుకు తల్లి నీలవేణి పడిన తపన, చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. అంబులెన్సుకే రూ.30 వేలు అయ్యాయి.
![](https://assets.eenadu.net/article_img/main4b_6.jpg)
కడుపులో బిడ్డను వేరు చేయలేదని దహనానికి తిరస్కారం
అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని మల్లాపూర్ శ్మశానవాటికకు తీసుకెళ్లగా అక్కడ తల్లినీ బిడ్డను వేరు చేస్తేగానీ దహనం చేయడం కుదరదని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఐదు ఆసుపత్రుల్ని సంప్రదించగా.. వారూ శస్త్రచికిత్స చేయడం కుదరదని చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో మృతదేహాన్ని ఇంటికే తీసుకెళ్లారు. వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓవైపు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఇది మరింత వేదన మిగిల్చింది.
- ఇదీ చదవండి నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత