Dowry Harassment: మూడేళ్లు నిండకుండానే మూడుముళ్ల బంధం ఆ ఇల్లాలికి శాపమైంది. భారీగా కట్నకానుకలతో అత్తింట అడుగుపెట్టిన ఆ ఇల్లాలు.. వారి దనదాహానికి బలైంది. భర్త, అత్తింటి వారి వేధింపులు, చిత్రహింసలు భరించలేక.. మృత్యువులో మనశ్శాంతిని వెతుక్కొంది. పుట్టింటి వారికి, తోబుట్టువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. హనుమకొండ జిల్లా గోపాలపూర్‌లోని బ్యాంక్ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్‌కు చెందిన జాటోత్ అము, చంద్రమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె అనూష(28) ఉన్నారు. పెద్దకుమారుడు వీరన్న, కూమార్తె అనూష ఉన్నత చదువులు చదివి బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. మిగిలిన ఇద్దరు కుమారులు సురేష్, నరేష్ స్థానికంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ముకుందాపురంలో పదో తరగతి వరకు, ఖమ్మంలో ఇంటర్, కరీంనగర్లో ఇంజినీరింగ్ చదివిన అనూష.. 2018లో యూనియన్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం సాధించారు. కొంతకాలం పాటు ఇల్లెందులో పనిచేశారు.
రూ.20 లక్షల కట్నం..
2019లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లికి చెందిన లావుడ్యా ప్రవీణ్‌నాయక్‌తో అనూషకు వివాహం జరిపించారు. హంటర్‌రోడ్డులోని యూనియన్ బ్యాంకు శాఖలో ప్రవీణ్‌నాయక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రూ.20 లక్షల కట్నంతోపాటు ఇతర లాంఛనాలు ఇచ్చారు. పెళ్లైయిననాటి నుంచి ప్రవీణ్ అదనపు కట్నం కోసం భార్యను మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఖమ్మంలో రూ.కోట్ల విలువ చేసే ఎకరం భూమిని కూడా ఇచ్చేందుకు ఆమె కుటుంబసభ్యులు సిద్ధపడ్డారు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష మరో గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రవీణ్ అనూషలకు ఏడాదిన్నర బాబు అండగా.. ప్రస్తుతం అనూష నాలుగు నెలల గర్భిణి.
అదనపు కట్నం కోసం భర్త వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సోదరుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ప్రవీణ్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని, అతడి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కొరివిపెట్టిన ఏడాదిన్నర కుమారుడు
హనుమకొండలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగిని అనూష అంత్యక్రియలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నెహూనగర్లో నిన్న జరిగాయి. ఏడాదిన్నర కుమారుడు చెర్రి.. తన తల్లికి కొరివి పెట్టాడు. ఈ ఘటన అక్కడకొచ్చిన వారందరినీ కన్నీరు పెట్టించింది.
ఇదీచూడండి: Woman Suicide in Bharatnagar : ఫోన్ ఎక్కువ మాట్లాడుతోందని అత్త మందలింపు.. కోడలి ఆత్మహత్య