కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్లికార్జున్ రెడ్డి, బోయ సంపత్‌ను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని బోయిన్పల్లి ఠాణాకు తరలించనున్నారు. మూడు రోజుల పాటు ఇద్దరు నిందితులను ప్రశ్నించి వారి నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. ఇద్దరు నిందితులు కలిసి ఈనెల 2న మియాపూర్‌లోని ఓ మొబైల్ దుకాణంలో ఆరు చరవాణిలు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 6 చరవాణిలను ఉపయోగించే.. అపహరణ సందర్భంగా సంభాషించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇద్దరు నిందితులను ప్రశ్నించడం ద్వారా... భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై బోయిన్పల్లి పోలీసులు.. నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఆమెకు సికింద్రాబాద్ న్యాయస్థానం బెయిల్ నిరాకరించటంతో.. సికింద్రాబాద్ ఎంఎస్‌జే కోర్టులో ఆమె తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విఖ్యాత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ అపహరణ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ప్రధాన నిందితులు అఖిలప్రియతో కలిపి 19మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుతో పాటు ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: పీఎఫ్ క్లెయిమ్ కోసం లంచం... సీబీఐకి చిక్కిన అవినీతి అధికారి