Ganja seized: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుపడింది. జిల్లా ఎస్పీ జి. వినీత్ తెలిపిన వివరాలు ప్రకారం సీపీఎస్ పోలీసులు, భద్రాచలం పోలీసులు కలిసి ఫారెస్ట్ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. బస్టాండ్ వైపు నుంచి భద్రాచలం బ్రిడ్జి వైపుగా అనుమానస్పదంగా వస్తోన్న రెండు ఇన్నోవా కార్లను గుర్తించారు. దీంతో వారికి అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. సుమారు 488 కేజీల గంజాయి పట్టుబడింది.
ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో పట్టుపడిన వారు బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మురు, సారపాకలకు చెందిన ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 97 లక్షల 60వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
ఇప్పటి వరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 18 మందిపై పీడీ యాక్టును నమోదుచేసినట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 11 కేసుల్లో 32 మందిని అరెస్టు చేసి 1.3 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జి.వినీత్ పేర్కొన్నారు.
"ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు, భద్రాచలం పోలీసులు కలిసి ఫారెస్టు చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానస్పదంగా వెళ్తున్న రెండు ఇన్నోవా కార్లను గుర్తించాం. వాటిని తనిఖీ చేయగా అందులో 488 కేజీల గంజాయి దొరికింది. దాని విలువ సుమారు 97 లక్షల 60వేలు ఉంటుంది. బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మురు, సారపాకలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు పరిసర ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించాం".- జి. విన్నీత్, జిల్లా ఎస్పీ
ఇవీ చదవండి: