Jubilee Hills Case: జూబ్లీహిల్స్‌లో అత్యాచార ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇవాళ తాజాగా బాధిత బాలిక స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఆరో నిందితుడిగా ఎమ్మెల్యే కుమారుడిని చేర్చనున్నట్లు వెల్లడించారు. అత్యాచార ఘటనలో ఎమ్మెల్యే కుమారుడిపై పెట్టనున్న కేసుపై సందిగ్ధత నెలకొంది. నిందితులు ఉపయోగించిన బెంజ్ కారులో క్లూస్ టీం ఆధ్వర్యంలో బాలిక చెవి కమ్మ, చెప్పులు, వెంట్రుకలు, నిందితుల వీర్యాన్ని (స్పెర్మ్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో స్వాధీనం చేసుకున్న టిష్యూ పేపర్లు ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని డీజీపీని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు.
అత్యాచారం రోజు ఏం జరిగిందంటే..!?
ఒక ఇంటర్నేషనల్ పాఠశాల పేరుతో మద్యం రహిత వేడుకకు అనుమతి తీసుకున్న ప్లస్ వన్, ప్లస్ టూ విద్యార్థులు, వారి స్నేహితులు పబ్‌కు వచ్చారు. 152 మందికి అనుమతి ఉండగా 182 మంది హాజరైనట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5.30 వరకు వారు అక్కడే ఉన్నారు. బల్దియాలోని ఓ కార్పొరేటర్ కుమారుడు (16) బాధిత బాలికతో మాట కలిపాడు. గతంలో ఒకసారి కలిశామంటూ కథలు చెప్పి నమ్మించాడు. తన స్నేహితులను పరిచయం చేశాడు. వేడుక ముగిశాక బాలికతో కలిసి వారంతా బెంజి, ఇన్నోవా కార్లలో బయలుదేరారు. ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు ఉమేర్‌ఖాన్ బెంజి కారు నడుపుతుండగా ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేటర్ కుమారుడు, ఇతర స్నేహితులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. వారు ఆమెకు ముద్దులు పెట్టడం, దగ్గరికి తీసుకొనే దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటికొచ్చాయి. ఆమెను బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని కాన్సు బేకరీకి తీసుకెళ్లి ఇన్నోవాలోకి ఎక్కించుకున్నాక నిందితులు సుమారు 50 నిమిషాల పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మార్గాల్లో చక్కర్లు కొడుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తర్వాత బాలికను పబ్ వద్ద వదిలేసిన నిందితులు అదే బేకరీ వద్ద ఫొటోలు దిగారు. పార్టీ ముగిసిందంటూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు, ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ తనయుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పబ్ నుంచి బేకరీకి వెళ్లే సమయంలో బెంజి కారును నడిపింది ఉమేర్‌ఖాన్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే తనయుడు, ఉమేర్‌ఖాన్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాదుద్దీన్ మాలిక్ (18)తో పాటు మరో ఇద్దరు బాలురను అరెస్టు చేసిన పోలీసులు శనివారం రాత్రి గుల్బర్గా ప్రాంతంలో మరో బాలుడిని అరెస్టు చేశారు. కీలక నిందితుడు ఉమేర్‌ఖాన్ (18)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వదంతులు వస్తున్నా, అతడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి: Imprisonment to Police: ఆ కేసులో నలుగురు పోలీసు అధికారులకు జైలుశిక్ష
ఇకపై నెలకు 24 ట్రైన్ టికెట్లు బుక్ చేసే వీలు.. కానీ ఓ షరతు!