POLICE SOLVED THE COUPLE MURDER CASE: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో 3 రోజుల క్రితం హత్యకు గురైన దంపతుల కేసును ఛేదించినట్లు ఎస్పీ విజయరావు తెలిపారు. కృష్ణారావు క్యాంటీన్లో సప్లయర్‌గా పని చేస్తున్న శివతో పాటు.. మృతుడి బంధువు రామకృష్ణ కలిసి హత్య చేసినట్లు వెల్లడించారు. కృష్ణారావును గొంతు కోసి చంపగా.. సునీతను తలపై బలంగా మోదీ చంపినట్లు తెలిపారు. క్యాంటీన్లో అందరి ముందు మందలించారనే కోపంతోనే శివ కక్ష పెంచుకున్నాడని అన్నారు. డబ్బుపై ఆశతో రామకృష్ణ.. శివకు సాయం అందించినట్లు తెలిపారు. అనుమానం రాకుండా ఉండేందుకు హత్య జరిగిన తరువాత కృష్ణా జిల్లాలో జరిగిన అంత్యక్రియలకు నిందితుడు శివ హాజరు అయినట్లు తెలిపారు.
"పథకం ప్రకారమే శివ జంటహత్యలు చేశాడు. కృష్ణారావును చంపిన తర్వాత సునీతను చంపారు. ఇంట్లో ఉన్న రూ.లక్ష 60 వేలును తీసుకెళ్లారు. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్లోనూ పాల్గొన్నాడు. సీసీ కెమెరాల ద్వారా మరిన్ని వివరాలు సేకరించాం. హోటల్‌లో అనేకసార్లు తిట్టారని కృష్ణారావుపై కోపం పెంచుకున్నాడు. కృష్ణారావుపై కోపం, డబ్బు కోసమే హత్యలు చేశాడు". -విజయరావు, ఎస్పీ
అసలేం జరిగిందంటే: నెల్లూరు నగరంలోని పడారుపల్లి సమీపంలోని అశోక్‌నగర్‌లో వాసిరెడ్డి కృష్ణారావు(54), సునీత(50) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రేమ్‌చంద్, సాయిచంద్ ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాక వేర్వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు విశాఖపట్నంలోని పోస్టల్ శాఖలో ఉద్యోగి కాగా.. చిన్న కుమారుడు నెల్లూరులోని పొగతోటలో హోటల్ నడిపిస్తున్నారు. అశోక్‌నగర్‌లో కృష్ణారావు, సునీత మాత్రమే ఉంటున్నారు. కృష్ణారావు స్థానికంగా కరెంట్ ఆఫీస్ సెంటరు వద్ద శ్రీరామ్ పేరుతో క్యాటరింగ్, హోటల్ నడిపిస్తున్నారు. వీరిది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం. కృష్ణారావు కదలికలపై రెక్కీ నిర్వహించిన దుండగులు.. కృష్ణారావు, సునీతలను చంపారు.
ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి రాగానే దారుణాన్ని చూసి కృష్ణారావు బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నగర ఇన్‌ఛార్జి డీఎస్పీ అబ్దుల్ సుబహాన్, స్థానిక ఇన్‌స్పెక్టరు నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. దోపిడీ ఎలా జరిగింది? హత్య ఎలా చేశారనే వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలు వాసిరెడ్డి సునీత.. తెదేపా సోషల్ మీడియా విభాగంలో పని చేస్తున్నారు. పోలీసులు రాజకీయ కోణంలోనూ దర్యాప్తు చేయాలని స్థానిక తెదేపా నేతలు కోరారు. శవ పంచనామా నిర్వహించిన పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో.. ఘటనా స్ధలం సమీపంలో పడి ఉన్న కర్ర, కత్తితో పాటు.. మృతుడి సెల్ ఫోన్‌ను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: