Youtuber gayatri died: హైదరాబాద్ గచ్చిబౌలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో... యూట్యూబర్ గాయత్రి మృతి చెందింది. హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకున్న ఆమె.. రాత్రి ప్రిజమ్ పబ్ నుంచి స్నేహితుడు రోహిత్‌తో కలిసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. తీవ్రగాయాలపాలైన గాయత్రి.. అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో రోహిత్‌కు తీవ్రగాయాలు కాగా.. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పబ్‌కు వెళ్లారా..
అయితే నిన్న హోలీ కావడంతో మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లను పోలీసులు మూసివేయించారు. నిబంధనలు పాటించకుండా పబ్ ఎలా తెరిచారు.. గత రాత్రి వీరిద్దరూ పబ్‌కు వెళ్లారా.. మద్యం సేవించిన తర్వాతనే ప్రమాదం జరిగిందా అనే విషయాలపై... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదుపు తప్పి.. ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి
శుక్రవారం సాయంత్రం సైబరాబాద్‌లోని విప్రో చౌరస్తా నుంచి గచ్చిబౌలి వైపు కారులో గాయత్రి, రోహిత్ బయలుదేరారు. ఉదయం నుంచి స్నేహితులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొని.. తిరిగి ఇంటికి వెళ్తుండగా సాయంత్రం 5.45 గంటల సమయంలో ఎల్లా హోటల్ సమీపంలో కారు అదుపు తప్పి వేగంగా ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అక్కడే చెట్లకు నీళ్లు పడుతున్న మల్లీశ్వరి అనే మహిళను ఢీకొట్టింది. ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది.
120కి పైగా వేగం
ప్రమాదం జరిగిన సమయంలో కారు 120 కిలోమీటర్లకుపైగా వేగంతో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఫుట్‌పాత్‌ను ఢీ కొన్న వెంటనే కారు బోల్తా పడటంతో... ప్రమాదం ధాటికి లోపల ఉన్న రోహిత్, గాయత్రి బయటపడ్డారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
బంధువుల ఆందోళన
కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్లీశ్వరి బంధువులు.. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హోటల్‌కు వాహనాల రాకపోకలు నిలిపేసి నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: Hyderabad Road Accidents: కలకలంరేపుతోన్న వరుస రోడ్డు ప్రమాదాలు... మితిమీరిన వేగమే కారణం?