ఓ దుండగుడు చూస్తుండగానే ఓ మహిళ మెడలోంచి గొలుసు దోచుకెళ్లాడు. అప్రమత్తమైన ఆమె పోలీసులకు తెలుపగా.. రాత్రి కల్లా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలోని ఓ స్టోర్‌లో పనిచేసే అనూష ఈ నెల 22న సాయంత్రం ఇంటికి వెళుతున్నారని.. గురువారం బంజారాహిల్స్ ఠాణా డీఐ మహ్మద్ హఫీజుద్దీన్, డీఎస్‌ఐ భరత్‌భూషణ్ తెలిపారు. కమలాపురి కాలనీ వద్ద ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ ఆగంతకుడు ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. వెంటనే ఆమె ఫిర్యాదు చేయగా.. రాత్రి 10 గంటలకల్లా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిక్కాడిలా
గొలుసు చోరీకి ముందు నిందితుడు బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి మీదుగా శ్రీనగర్‌కాలనీ వెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా కమలాపురి కాలనీ దారికి చేరుకుని అక్కడ అనూష మెడలో గొలుసు లాక్కొని బంజారాహిల్స్ వైపు వెళ్లిపోయాడు. ఫిర్యాదు అందగానే పోలీసులు.. ట్రాఫిక్ పోలీసులతో కలిసి సీసీ ఫుటేజీలు, నిఘా’ కెమెరాల్లో నిందితుడి ఫొటోను వెతికారు.
ఇంటి వద్దే అదుపులోకి
శిరస్త్రాణం ధరించకపోవడంతో వాహన నంబరు, నిందితుడి ఫొటో స్పష్టంగా కనిపించాయి. నిందితుడిని ఇందిరానగర్‌కు చెందిన జర్కుల వీరన్న(24)గా గుర్తించారు. మరిన్ని నిఘానేత్రాలను పరిశీలించగా నిందితుడు కృష్ణనగర్‌లోని ఓ బంగారు ఆభరణాల రుణ సంస్థకు, అనంతరం రాత్రి 9 గంటలకు ఓ వైన్స్ ముందు మద్యం తాగుతున్నట్లు గుర్తించారు. వాటన్నింటిలో నిందితుడు వేసుకున్న నీలం రంగు చొక్కా, అతని ప్యాంటు అతన్ని గుర్తుపట్టేలా చేశాయి. రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగారు గొలుసును కుదవపెట్టగా దానిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐ తెలిపారు.
ఇదీ చూడండి: యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు