Councilor murder case: మహబూబాబాద్‌లో కౌన్సిలర్ రవి హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు భుక్యా విజయ్, భుక్యా అరుణ్, అజ్మీర బాలరాజు, గుగులోతు చింటు, కారపాటి సుమంత్, అజ్మీర్‌కుమార్, గుగులోతు బావుసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారు, ట్రాక్టర్, కత్తి, గొడ్డలి, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మహబూబాబాద్ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించారు.
రవి హత్యకు మూడ్రోజులుగా నిందితులు రెక్కీ నిర్వహించారు. బెల్లం, కర్ర వ్యాపారాన్ని పోలీసులకు పట్టిస్తున్నాడనే కోపంతో రవి హత్య జరిగింది. గతంలో రవికి వ్యాపారంలో విజయ్, అరుణ్ సహకరించారు. కొంతకాలం తర్వాత కౌన్సిలర్ రవితో విజయ్, అరుణ్‌కు విభేదాలు వచ్చాయి. వ్యాపార విభేదాలతో రవికి వారిద్దరూ దూరంగా ఉన్నారు. తర్వాత విజయ్, అరుణ్ సొంత వ్యాపారాలు పెట్టుకున్నారు. విజయ్ కలప ట్రాక్టర్‌ను అటవీ అధికారులు రెండుసార్లు పట్టుకున్నారు. రవి కావాలనే ట్రాక్టర్ పట్టించాడని విజయ్ అనుమానించాడు. భూపట్టా విషయంలోనూ రవి డబ్బులడిగాడని పగ పెంచుకున్నాడు. విజయ్‌కి బంధువైన బాబు నాయక్ తండాకి చెందిన భూక్యా అరుణ్ కూడా ఈ మధ్య కాలంలో నల్ల బెల్లం అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఒక ఐస్ క్రీం అమ్మే వ్యక్తితో అరుణ్ గొడవపడగా పీఎస్‌లో కేసు నమోదైంది. వీరిద్దరితో పాటు బాబు నాయక్ తండాకి చెందిన అజ్మీర బాలరాజుకు కూడా బానోతు రవి దూరపు బంధువు. బాలరాజు కూడా బెల్లం వ్యాపారం చేస్తున్న సమయంలో అడ్డుపడినాడని.. అతని పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాడని కక్ష పెంచుకున్నాడు. కొద్ది రోజులుగా విజయ్, అరుణ్, బాలరాజు కలిసి వారి వ్యాపారాలకు అడ్డు వస్తున్న బానోతు రవిని చంపాలనే నిర్ణయానికి వచ్చారు. - శరత్‌చంద్ర పవార్, మహబూబాబాద్ ఎస్పీ
పథకం ప్రకారం బానోతు రవిని చంపటానికి గత మూడు రోజుల నుంచి రెక్కీ నిర్వహించారని ఎస్పీ వెల్లడించారు. గొడ్డలి, కత్తిని తయారుచేయించి విజయ్ ఇంట్లో దాచిపెట్టారని.. కారు కిరాయి తీసుకుని బానోతు రవిని గుద్ది చంపాలని నిర్ణయించున్నట్లు తెలిపారు. రవి సమాచారం ఎప్పటికప్పుడు తెలిసేందుకు విజయ్, అరుణ్ స్నేహితులైన అయిన మంగళికాలనీకి చెందిన గుగులోతు చింటు, జై సతీశ్, మరో ఇద్దరు వ్యక్తులతో నిఘా ఉంచారని పేర్కొన్నారు.
ఏడుగురు నిందితులు కలిసి పక్కా ప్లాన్ ప్రకారం రవిని అంతమొందించారు. రవిని కారులో ఫాలో అవుతున్న అరుణ్.. విజయ్‌కి సమాచారం ఇవ్వడంతో సొంత ట్రాక్టర్ తీసుకొచ్చి గుద్దినట్లు ఎస్పీ వివరించారు. అప్పటికే అక్కడే కాచుకుని ఉన్న నిందితులు రవిని గొడ్డలితో నరికి, అక్కడి నుంచి పారిపోయారు. ఇదీ గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమివ్వగా.. రక్తపుమడుగులో ఉన్న కౌన్సిలర్‌ను హుటాహుటిన మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తుండగా రవి ప్రాణాలు విడిచారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న అదనపు ఎస్పీ యోగేశ్ గౌతమ్, డీఎస్పీ సదయ్య, సీఐలు సతీష్, రవి కుమార్, మహబూబాబాద్ టౌన్ ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ కౌన్సిలర్ దారుణ హత్య.. నడిరోడ్డుపై గొడ్డలితో నరికి..