Theft Gang Arrested: ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి చోరీకి గురైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మైనర్ కూడా ఉన్నాడు. మైనర్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కాదనేది. ఆమె ప్రేమను పొందడం ఎలా అని స్నేహితుడ్ని సలహా అడిగాడు. ఒడిశాలో అమ్మాయిని వశపరుచుకునే మందు ఉందని.. దాని ధర లక్ష రూపాయలకు పైగా ఉందని చెప్పాడు. దీంతో దాని కొనుగోలుకు సిద్ధమయ్యాడు. మందు కొనేందుకు డబ్బు లేకపోవడంతో.. ఆ స్నేహితుడి సలహాల ప్రకారం చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.
ఈ కేసులో సీఐ నాగేశ్వరరావు పలు కీలక విషయాలు వెల్లడించారు. బొబ్బిలిలో గత ఏడాది డిసెంబర్ 3న.. నవంబర్ 11న వరుస చోరీలకు పాల్పడింది పల్లెవీధికి చెందిన కె.కిరణ్.. మరో మైనర్‌ను గుర్తించి వారిని అరెస్టు చేశామన్నారు. మురళీకృష్ణ అలియాస్ నాని పరారీలో ఉన్నట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై.. అమ్మాయిల్ని వశపరుచునే మందు దొరుకుతుందని స్నేహితుడ్ని తప్పుదారి పట్టించిన కిరణ్.. తొలుత ఆన్లైన్ జూదాలు, చెడు వ్యసనాలతో అప్పులపాలు అయ్యాడు. వాటిని తీర్చేందుకు మైనర్‌తో దొంగతనాలు చేయించేవాడు. వీరంతా రాత్రి పూట వీడియో కాల్ ద్వారానే చోరీలకు పాల్పడేవారు. కిరణ్ వీడియోకాల్ చేసేవాడు. మిగిలిన వారు అతడు చెప్పినట్టు బీరువా తాళాలు తీయడం, సొమ్ము ఎత్తుకురావడం చేసేవారని సీఐ తెలిపారు.
ఇవీ చదవండి: