Mahesh Bank Server hacking Case: మహేశ్‌బ్యాంక్‌పై సైబర్‌దాడి కేసులో పోలీసులు ఎట్టకేలకు ఇద్దరు హ్యాకర్లను గుర్తించారు. పంజాబ్‌లోని పాటియాలలో నివాసముంటున్న బల్వీందర్ సింగ్, డేవిడ్ కుమార్‌లను నాలుగు రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి హ్యాకర్లకు సంబంధించిన విషయాలు రాబట్టారు. వీరిద్దరూ హ్యాకర్లకు సిమ్‌కార్డులు సరఫరా చేశారు. సిమ్‌కార్డుల ద్వారా రివర్స్ ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో పరిశోధన కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల్లో వీరి వివరాలు తెలిసే అవకాశాలున్నాయని ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు తెలిపారు.
ఇమ్రాన్ దుబాయి వెళ్లినా.. ముంబయిలో ఉంటున్న ఇమ్రాన్ ధ్యాన్‌సే ఈ ఏడాది జనవరిలో ఓ నైజీరియన్‌ను కలిశాడు. కమీషన్ ఆశ చూపి జనవరి 23, 24 తేదీల్లో మహేశ్ బ్యాంక్‌పై సైబర్‌దాడికి పాల్పడ్డ నిందితులు ఇమ్రాన్ ఖాతాలో రూ.52 లక్షలు జమ చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్ దుబాయికి వెళ్లాడు. పోలీసులు అతడి బ్యాంక్ ఖాతాలోని రూ.52 లక్షలను స్తంభింపజేశారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పదిహేను రోజుల క్రితం ముంబయికి రాగానే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.
అసలేం జరిగింది? : మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో కీలక నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సర్వర్‌ను హ్యాక్ చేసి 12 కోట్ల ఇతర ఖాతాలకు మళ్లించిన ఘటనలో ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించారు. జనవరి 23వ తేదీన మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసిన నిందితుడు పన్నెండు కోట్ల రూపాయలను.. నాలుగు ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న మరో 128 ఖాతాలకు రూ. 12 కోట్లు మళ్లించాడు. సర్వర్‌లో నుంచి నగదు అక్రమంగా బదిలీ అయిన విషయం గమనించిన బ్యాంకు ప్రతినిధులు.. అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ అయిన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సదరు బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడంతో రూ. 3 కోట్ల రూపాయలను బదిలీ కాకుండా నిలిపి వేయగలిగారు. రూ. 9 కోట్ల రూపాయలు మాత్రం సైబర్ నేరగాళ్లు పలు ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నారు.
ఇవీ చదవండి: Mahesh Bank Hacking Case: 'హ్యాకర్ కోసం వేట... బ్లూ కార్నర్ నోటీసులు సిద్ధం'
Amith shah On CM Kcr: ఇంత అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు: అమిత్ షా