సిద్దిపేట జిల్లా తోగుట పోలీస్‌స్టేషన్ పరిధిలో తుపాకీతో కాల్చి హత్యకు యత్నించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. భూతగాదాల కారణంగానే హత్యాయత్నం జరిగినట్టు సీపీ శ్వేత వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు.. వారి దగ్గరి నుంచి తుపాకీ, నాలుగు రౌండ్ల తూటాలు, కత్తి, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడైన వంశీకృష్ణ, నిందితుడైన ఒగ్గు తిరుపతి.. ఇద్దరూ దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందినవారే.. కాగా వంశీకృష్ణ కుటుంబం హైదరాబాద్‌లో నివాసముంటుంది.
ప్రాణహాని ఉందనే..
గతంలో వంశీకృష్ణ కుటుంబానికి సంబంధించిన భూమి అమ్మకం విషయంలో ఒగ్గు తిరుపతి మధ్యవర్తిగా వ్యవహరించి మోసం చేశాడని తగాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే 2020లో ఒగ్గు తిరుపతిని హత్య చేయడానికి ప్రయత్నించి తన తల్లితో పాటు వంశీకృష్ణ జైలు పాలయ్యాడు. ఆ ఘటన తరువాత వంశీకృష్ణ వల్ల తనకు ఎప్పటికైనా ప్రాణహాని ఉందని నిశ్చయించున్న తిరుపతి.. అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన గ్రామంలో ఇల్లు నిర్మించడానికి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్ల ద్వారా ఓ తుపాకీ, తూటాలు కొనుగోలు చేశాడు. వాటితో పాటు సిద్దిపేటలో ఓ కత్తిని, తలకు పెట్టుకునే విగ్గు కొనుగోలు చేసి.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
కోర్టు నుంచి తిరిగి వెళ్లుండగా..
బుధవారం(మార్చి 9) రోజు వంశీకృష్ణ తన తల్లి ఎల్లవ్వతో కలిసి.. హత్యాయత్నం కేసులో దుబ్బాక కోర్టుకు వస్తున్నాడని తెలుసుకున్నాడు. కోర్టు నుంచి వంశీకృష్ణ తన తల్లితో ద్విచక్రవాహనంపై హైదరాబాద్ తిరిగి వెళ్లే క్రమంలో వాళ్లను తిరుపతి అనుసరించాడు. జప్తి లింగాపూర్ గ్రామశివారులోకి రాగానే.. శరత్ అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని వంశీకృష్ణకు సమాంతరంగా పోనివ్వగా.. ఒగ్గు తిరుపతి తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక రౌండు ద్విచక్రవాహనంలోకి రెండో రౌండు గాలిలోకి దూసుకెళ్లాయి. తిరుపతిని గుర్తుపట్టిన వంశీకృష్ణ.. ప్రాణభయంతో తన బైక్ వేగం పెంచాడు. పారిపోతూనే డయల్ 100కు ఫోన్ చేసి.. అసలు విషయాన్ని పోలీసులకు తెలిపాడు.
అతి తక్కువ సమయంలోనే..
వెంటనే స్పందించిన పోలీసులు.. సాంకేతిక సహాయంతో అతి తక్కువ సమయంలోనే ఒగ్గు తిరుపతిని సిద్దిపేటలో అదుపులోకి తీసుకున్నాడు. తిరుపతికి సహకరించిన శరత్‌ను చెల్లాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామని.. అందుకోసం కమిషనరేట్ పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను గత నెలలోనే నియమించినట్టు సీపీ శ్వేత తెలిపారు. ప్రజలకు ఎవరైనా అక్రమంగా తుపాకులు కలిగి ఉన్నా.. లైసెన్స్ తుపాకి కలిగి ఉన్నా.. వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినా.. సెటిల్మెంట్లకు పాల్పడినా.. వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.
ఇదీ చూడండి: