Chittoot Police constable suspended: చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరానికి చెందిన ఎస్సీ మహిళ ఉమా మహేశ్వరినీ చితక బాదిన ఘటనలో ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ సురేష్ బాబు సస్పెండ్ అయ్యాడు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి
విచారణ పేరుతో మహిళను తీవ్ర గాయాలపాలు చేసిన ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ ఘటన పై ఏఎస్పీ మహేష్‌ను విచారణాధికారిగా నియమించారు. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన ఏఎస్పీ... నివేదికను ఎస్పీ సెంథిల్ కుమార్‌కు అందజేశారు. దీంతో మహిళను చితకబాదిన ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ సురేష్ బాబును సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
విచారణ పేరుతో ఎస్సీ మహిళపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది. వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ.రెండు లక్షల నగదు కనిపించకపోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరిని ప్రశ్నించారు. నగదు కనిపించకపోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు. ఈ నెల 18 వ తేదీ చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తనను పిలిపించి చేతి వేలి ముద్రలు తీసుకుని పోలీసులు పంపించేసినట్లు ఉమా మహేశ్వరి మీడియాకు తెలిపారు.
అనంతరం 19 వ తేదీ తనను మళ్లీ పోలీసు స్టేషన్‌కు పిలిచి కాళ్లు చేతులు కట్టేసి లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. స్పృహ కోల్పోయే వరకు తనను పోలీసులు కొట్టారని ఆమె తెలిపారు. అనంతరం ఎస్సై వచ్చిన తరువాత తనను పోలీసులు విడిచి పెట్టారని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త, తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వెల్లడించారు.
తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని ఆమె ఆరోపించారు. అనంతరం దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలియడంతో పోలీసులు తనను బుజ్జగించినట్లు చెప్పారు. తనకు తగిలిన గాయాలకు చికిత్స చేయించి పరిహారం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయం బయట ఎవరికీ చెప్పకూడదని బెదిరించినట్లు ఉమా మహేశ్వరి పేర్కొన్నారు. అకారణంగా తనను దొంగతనం పేరుతో చిత్రహింసలు చేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.
ఇదీ చూడండి: లాఠీ కాఠిన్యం... విచారణ పేరుతో దళిత మహిళను చిత్రహింసలు.!
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!