Telangana Realtors Murder Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారుల హత్య కేసును పోలీసులు చేధించారు. భూవివాదం కారణంగానే హత్యలు జరిగాయని గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు 7.65 ఎంఎం దేశవాళీ తుపాకులు, 19 బుల్లెట్లు, ద్విచక్రవాహనం, కారు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అసలు ఎక్కడ మొదలైందంటే..?
కర్ణంగూడ వద్ద 20 ఏళ్ల క్రితం కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు లేక్ విల్లా అర్చడ్స్ పేరుతో 20 ఎకరాలు వెంచర్ వేశారు. యజమానులు దూర ప్రాంతంలో ఉండటంతో మేరెడ్డి మట్టారెడ్డి అలియాస్ అశోక్‌రెడ్డి 2014లోనే 15 ఎకరాలు ఆక్రమించాడు. 2018లో మరికొన్ని ప్లాట్లు కొన్నాడు. ఇందులో 14 ఎకరాల పదిన్నర గుంటలు అభివృద్ధి చేసేందుకు శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడు. అతడు తన డ్రైవర్ కృష్ణ పేరిట... భూమి యజమానులు శాంతకుమారి, పురుషోత్తంరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నుంచి లీజు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో 15 ఎకరాలను కలిపేసుకున్నాడు. దీంతో మట్టారెడ్డి తన ప్లాట్ల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించగా... వారిద్దరి మధ్య వివాదం మొదలైందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. భూమిని లీజుకు తీసుకున్నానని శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పగా..... స్థలాన్ని ఖాళీ చేయకుంటే అంతుచూస్తానని మట్టారెడ్డి బెదిరించినట్లు వెల్లడించారు. శ్రీనివాసరెడ్డిని హత్య చేసేందుకు వెంచర్స్ వాచ్‌మెన్ ఖాజామొయినుద్దీన్, బుర్రి భిక్షపతితో ఒప్పందం కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు.
ఏమాత్రం బెదరకుండా..
శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ రెడ్డి హత్యల తర్వాత మట్టా రెడ్డి అక్కడే ఉన్నాడని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు ఏ మాత్రం బెదరకుండా అమాయకుడినంటూ బుకాయించాడని చెప్పారు. హత్య విషయం తానే సూపర్ వైజరుకు ఫోన్ చేసి చెప్పినట్లు నమ్మించాడని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కూపీ లాగామన్న సీపీ... హత్య అనంతరం కాల్పులు జరిపిన వారితో మట్టారెడ్డి మాట్లాడినట్టు ఆధారాలు సేకరించామన్నారు. మట్టారెడ్డిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మలక్‌పేట, నారాయణగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నేరాలకు పాల్పడుతూ మారుపేర్లతో చెలామణీ అవుతున్నాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్‌డేటా ఆధారంగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీపీ మహేశ్ భగవత్ వివరించారు.
మట్టారెడ్డిదే మొత్తం పథకం..
"రియల్టర్లపై కాల్పుల కేసులో మట్టారెడ్డి, మోహియుద్దీన్, భిక్షపతి, షమీం, రహీంను అరెస్టు చేశాం. నిందితుల నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ హత్యలో వాడిన తుపాకులు, మందు గుండు సామగ్రి కొనేందుకు నిందితులు బిహార్ వెళ్లారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోవడంతో ప్రత్యేక కేసుగా భావించి ఛేదించాం. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నాం. కాల్పుల ఘటనపై పథక రచన మొత్తం మట్టారెడ్డిదే. స్థిరాస్తి వ్యాపారులపై భిక్షపతి, మోహియుద్దీన్ కాల్పులు జరిపారు. తొలుత విచారణలో మట్టారెడ్డి మాకు సహకరించలేదు. గెస్ట్‌హౌస్‌లో దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాం. అన్ని ఆధారాలు చూపించాక మట్టారెడ్డి నేరం ఒప్పుకున్నాడు." - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
ఇవీ చూడండి: