IPL Betting: హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ ఎత్తున బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వారి వద్ద రూ.12.50 లక్షల నగదు, కారు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.90 లక్షలు ఉన్న అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. ఆటోనగర్‌లోని గ్రీన్ మిడోస్‌లో నివాసం ఉండే చక్రి గోవా, బెంగళూరు, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మాచ్ జరుగుతుండగా దాడులు చేసిన పోలీసులు ఆర్గనైజర్ చక్రవర్తితో పాటు మరో నలుగురు హరీశ్, సురేష్ రెడ్డి, సామ జైపాల్ రెడ్డి, షేక్ అసిఫ్ పాషను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు అప్పలరాజు, శ్రీనివాస ఉదయ్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చక్రి విలాసాల కోసం డబ్బులు సులువుగా సంపాదించేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నపుడు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు పట్టుబడిన చక్రి జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. నిందితులు క్రికెట్ మజా అనే యాప్ ద్వారా బెట్టింగ్ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అదే సమయంలో లావాదేవీలకు ఉపయోగించే రెండు అకౌంట్లు వెంకటేశ్వర ట్రేడర్స్, లక్ష్మీ దుర్గ ట్రేడర్స్ పేర్లపై కరెంట్ అకౌంట్లు తెరిచి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వివరించారు. ఎవరైతే బెట్టింగ్ పాల్గొంటారో వారికి ముందుగానే టెలిఫోన్ లైనింగ్ ఇచ్చి మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు బెట్టింగ్ చేస్తారని విచారణలో వెల్లడైంది. ఈ తతంగమంతా ఆటోమేటిక్ రికార్డ్ చేసి మ్యాచ్ ముగిశాక నగదు బదిలీ చేసేవారని పోలీసులు పేర్కొన్నారు. నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.
ఇదీ చూడండి: లేలేత ప్రాయంలో మత్తుకు బానిసై.. వైట్నర్ సేవిస్తున్న చిన్నారులు