చేతబడి చేస్తున్నాడన్న మూఢనమ్మకంతో వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడు ఎట్టకేలకు కూకట్పల్లి పోలీసులకు చిక్కాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
వరుస మరణాలతో..
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు, వెంకటస్వామి వరుసకు సోదరులవుతారు. కొన్నేళ్ల క్రితం వెంకటస్వామి, అతని అక్క బాలమ్మ చనిపోయారు. ఈ క్రమంలో ఆంజనేయులు చేతబడి చేయడం కారణంగానే వారు మరణించారని వెంకటస్వామి కుమారుడు చందు రోజూ వారితో గొడవపడేవాడు. ఆ గొడవలు భరించలేక ఆంజనేయులు కొన్నేళ్ల కిందట కూకట్పల్లికి వలస వచ్చాడు.
అనుమానంతో..
ఆంజనేయులు కొడుకు కృష్ణ కూడా అతని క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడని చందు అనుమానం పెంచుకున్నాడు. కొన్ని రోజుల కిందట తన ఇంట్లో జరిగిన ఫంక్షన్కు కృష్ణను ఆహ్వానించాడు. ఆ తర్వాత అతని కూతురు అనారోగ్యానికి గురికావడం వల్ల కృష్ణ వారికి చేతబడి చేశాడని అనుమానించాడు. ఈ క్రమంలో జనవరి 3న రాత్రి 10:30 గంటల సమయంలో గ్రామంలోని కృష్ణ ఇంటికి వెళ్లిన చందు అతన్ని రోకలిబండతో కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకుని వచ్చి గ్రామ శివారులోని నల్లచెరువులో పడేశాడు. చెరువులో మృతదేహం ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Acb: కల్యాణలక్ష్మి కాసుల కోసం కక్కుర్తి... ఏసీబీ చేతికి చిక్కి..