యాదగిరిగుట్టలో ఇటీవల కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. యథేచ్చగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రముఖుల పర్యటనలే టార్గెట్ చేసుకొని.. అందింది దోచుకుంటున్నారు. నగదు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులను చోరీ చేస్తున్నారు.
ఇవాళ యాదగిరిగుట్టలో మున్నూరుకాపు నిత్యాన్నదాన ఛారిటబుల్ ట్రస్ట్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. ట్రస్ట్ సభ్యులు, ఇతర ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సుమారు లక్ష రూపాయలు, సెల్ఫోన్లు చోరీ చేశారు. యాదాద్రిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి.
గతంలోనూ..
ఆగస్టు 28న యాదాద్రి జిల్లా మోత్కూరులో మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. వారు పట్టణానికి చేరుకోగానే స్వాగతం పలికేందుకు వాహనం చుట్టూ... నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. వీరితోపాటే దూరిన దొంగలు... మోత్కూరు జడ్పీటీసీ(ZPTC) భర్త గోరుపల్లి సంతోష్‌రెడ్డి జేబులో నుంచి డబ్బులు కాజేశారు. ఈ కార్యక్రమం అనంతరం, తన జేబులో ఉన్న 40వేల రూపాయలు పోయినట్లు గుర్తించిన సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మున్నూరుకాపు నిత్య అన్నదాన సత్రం ప్రారంభం..
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించిన మున్నూరుకాపు నిత్య అన్నదాన సత్రాన్ని శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రారంభించారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించినట్లు విద్యాసాగర్‌రావు తెలిపారు. నేటి నుంచే ప్రతిరోజు అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. స్వామి సన్నిధిలో మున్నూరుకాపు భవన నిర్మాణానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా విరాళాలతోనే.. ఇంత పెద్ద భవనాన్ని నిర్మించుకున్నామని తెలిపారు.
మున్నూరుకాపుల ఐక్యతకు ఈ భవనమే నిదర్శనమని.. ప్రముఖ మెజీషియన్ సామల వేణు అన్నారు. విరాళాలు ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచూడండి: Ministers Visit: మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం.. నేతల జేబులకు కన్నం!