సిమ్‌కార్డును కొంతకాలం పాటు వాడకపోయినా.. బిల్లు చెల్లించకపోయినా సిమ్‌కార్డు పనిచేయదు. ఆతర్వాత ఆ నంబరును కంపెనీ ఎవరికైనా జారీ చేయవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలా కోల్పోయిన తన నంబరుకోసం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడ్డాడు. ఆ నంబర్ ఉపయోగిస్తున్న జడ్పీ కార్యాలయం వద్దకు వెళ్లి తన నంబర్ తనకు ఇస్తారా లేదా అని వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది.
ఆ నంబర్ జడ్పీ కార్యాలయానికి కేటాయింపు
బృందావన్ గార్డెన్స్‌కు చెందిన ఓ యువకుడు ఓ కంపెనీకి చెందిన సిమ్ కార్డును గత కొంతకాలంగా ఉపయోగిస్తున్నాడు. కొన్నాళ్లుగా బిల్లు చెల్లించకపోవడంతో సదరు కంపెనీ వాళ్లు ఆ నంబర్‌ను డీఫాల్ట్ చేశారు. కొత్తగా నంబర్లు జారీ చేసే క్రమంలో ఆ నంబర్‌ను జిల్లాపరిషత్ కార్యాలయానికి(జడ్పీ) దానిని కేటాయించారు. తన సెల్‌ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో ఆ యువకుడు... తన నంబరు వేరే వాళ్లకు జారీ అయిన విషయం తెలుసుకున్నాడు.
ఒంటిపై కిరోసిన్ పోసుకొని..
జడ్పీ కార్యాలయానికి వచ్చి.. తన నంబర్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ వాదనకు దిగాడు. అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులు కార్యాలయం కోసం కొత్తగా సిమ్‌కార్డు తీసుకున్నారని, ఆ నంబర్‌ను తమకు కంపెనీ వాళ్లు ఇచ్చారని తెలిపారు. అయినా అతను వినకుండా తన నంబర్ ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా వెంట తెచ్చుకున్న డబ్బాలో కిరోసిన్‌ను శరీరంపై పోసుకున్నాడు. ఊహించని పరిణామంతో నిర్ఘాంతపోయిన జడ్పీ కార్యాలయ సిబ్బంది నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి చేతిలోని కిరోసిన్ డబ్బాను లాక్కొన్నారు. అతన్ని సముదాయించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఏం జరిగిందని వివరాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో తన నంబర్ ఇప్పించాలంటూ అతడు పోలీసులపై ఒత్తిడి చేయడంతో... కంపెనీ వాళ్లకు చెప్పి మంచి ఫ్యాన్సీ నంబర్ ఇప్పిస్తానని సీఐ బుజ్జగించి పంపించారు.
ఇదీ చూడండి: LORRY ACCIDENT: కృష్ణా జిల్లాలో లారీ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి