కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పు చెల్లించలేదని పోలీస్ స్టేషన్కు పిలిపించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలం బెక్కర్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
బెక్కర్ పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు అదే మండలంలోని కుమార్ లింగంపల్లి గ్రామానికి చెందిన వీరేశం అనే వ్యక్తి వద్ద రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బుకు వడ్డీ క్రమం తప్పకుండా చెల్లించేవాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో వడ్డీ చెల్లించడం ఆలస్యం కావడంతో అప్పుగా తీసుకున్న మొత్తం, వడ్డీ చెల్లించాలని వీరేశం హెచ్చరించాడు. ఇదే విషయమై అప్పు ఇచ్చిన వీరేశ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఇద్దరినీ స్టేషన్కి పిలిపించారు. దీంతో ఆంజనేయులు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు దాడి చేశారని బంధువుల ఆరోపణ
పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆంజనేయులుపై దాడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బంధువులు ఆరోపించారు. మృతదేహంతో ఠాణా ముందు ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలానికి సీఐ చేరుకుని కుటుంబ సభ్యులకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది.