రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిదిమంది సభ్యుల ముఠాలోని ఆదేశ్ శర్మ అనే దొంగను రామగుండం కమిషనరేట్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్నారు. అతని నుంచి 20 తులాల బంగారాన్ని రికవరీ చేశామని తెలిపారు.
ఇదీ జరిగింది:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో మార్చి 24 రాత్రి చోరీ జరిగింది. కిటికీ గ్రిల్స్ తొలగించి, గ్యాస్ కట్టర్ సహాయంతో సేఫ్టీ లాకర్లోని సుమారు ఆరు కిలోల బంగారం, 18 లక్షల నగదును అపహరించారు.
తర్వాత రోజు ఉదయం బ్యాంక్ మేనేజర్ ప్రహ్లాద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీంలు, డాగ్ స్క్వాడ్ బృందాల సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర దొంగల పనేనని నిర్ధరించుకున్నారు. ఈ దొంగతనంలో తొమ్మిది మంది సభ్యుల ముఠా పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధరణ చేసుకొని కేసులో ముందుకెళ్లారు.
తొమ్మిది మంది సభ్యుల ముఠా మొదటగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌లోని ఒక ఇంట్లో 15 రోజుల పాటు ఉండి రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. మార్చి 19న చంద్రపూర్‌లోని ఒక బ్యాంకులో, అంతకు ముందు పలు బ్యాంకుల్లో, ఏటీఎంలలో చోరీ చేశారన్నారు.
22వ తేదీన గుంజపడుగు గ్రామానికి చేరుకొని రెక్కీ నిర్వహించి.. 24న బ్యాంకులో చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో ఐదుగురు దొంగలు మహారాష్ట్ర పోలీసుల అదుపులో, మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆదేశ్ శర్మను మంథని మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు.
ఇదీ చూడండి: జాబ్ మారాలనుకుంటే... జీతం ఊడ్చేశారు