ఏపీలోని అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో అమానుషం చోటుచేసుకుంది. మండలంలోని ఒక గ్రామానికి చెందిన మానసిక స్థితి సరిగా లేని 13 ఏళ్ల బాలికపై.. వరుసకు తాత అయ్యే 64 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మాయమాటలతో బాలికను లొంగ తీసుకున్నాడు. ఆపై బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లగా... తండ్రి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటాడు. ఇదే అదనుగా భావించిన ఆ కామ వృద్ధుడు.. కొన్ని నెలలుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
మూడు రోజులుగా బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటం గమనించిన తండ్రి.. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె గర్భం దాల్చిందని వైద్యులు ధృవీకరించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గర్భం రావటానికి కారకుడైన వృద్ధుడిపై బాధితురాలి తండ్రి... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం అనంతపురం తరలించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.