మేడ్చల్ జిల్లా జీడిమెట్ల లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్బిణికి.. వైద్యుడు లేకుండానే.. నర్సులు కాన్పు చేయడం కలకలం రేపింది. అపురూప కాలనీకి చెందిన భార్గవి శుక్రవారం సాయంత్రం జీడిమెట్ల సబ్‌స్టేషన్ పరిధిలోని లయన్స్ క్లబ్ ఆస్పత్రిలో చేరారు. రాత్రి ఏడు గంటల తర్వాత నొప్పులు తీవ్రం కావడంతో డాక్టర్ అందుబాటులో లేకుండా పోయారు.
నర్సులు జోస్న, రాణి గర్బిణీని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారని బాధితురాలి భర్త ఆరోపించారు. సాధారణ ప్రసవం చేశారని.. బిడ్డ మృతి చెందాక.. స్థానిక ఆసుపత్రికి తరలించమని చెప్పారని వాపోయారు. న్యాయం చేయాలని బాధితులు లయన్స్ క్లబ్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
'నా భార్య భార్గవిని శుక్రవారం సాయంత్రం లయన్స్ క్లబ్ ఆస్పత్రికి తీసుకువచ్చాం. రాత్రి ఏడు గంటల వరకు డాక్టర్ ఉన్నారు. డాక్టర్ వెళ్లిపోగానే ఇద్దరు నర్సులు రాణి, జ్యోత్స్న వచ్చి భార్గవిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లారు. పది గంటల 30 నిమిషాల వరకు థియేటర్లోనే ఉంచారు. మధ్యమధ్యలో బయటకు వస్తూ పది నిమిషాల్లో అయిపోతుందంటూ చెప్పారు. రాత్రి 10.30 గంటలకు బయటకు వచ్చి పాపను తీసుకువచ్చి.. పాపకు ఊపిరాడటం లేదు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి పాపను తీసుకువెళ్తే పాప అంతకుముందే చనిపోయిందని చెప్పారు. కాన్పు కోసం ఆస్పత్రికి వస్తే మాకు కడుపుకోత మిగిల్చారు.'
- జగదీశ్, భార్గవి భర్త
- ఇదీ చదవండి : వివాహితపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!