ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం(JAYARAM MURDER CASE) హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. నాంపల్లి(NAMPALLY MAGISTRATE COURT) రెండో అదనపు సెషన్స్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం వాదనలు ప్రారంభమయ్యాయి. 2019 జనవరి 31న చిగురుపాటి జయరాంపై కవకుట్ల రాకేశ్ రెడ్డి.. మరో 11 మందితో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని తన నివాసంలో హత్యకు పాల్పడ్డారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కారులో పెట్టి.. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ సమీప జాతీయ రహదారి పక్కన పడేశారు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
తొలుత ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ.. హత్య ఘటన జూబ్లీహిల్స్‌లో జరిగినట్లు తేలింది. దీంతో కేసును తెలంగాణ పోలీసు శాఖకు బదిలీ చేశారు. ఈ కేసును అప్పటి బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కె.ఎస్.రావును విచారణాధికారిగా నియమించారు. విచారణ వేగాన్ని పెంచిన రాష్ట్ర పోలీసులు ఈ హత్యకేసులో అసలైన నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగానే రాకేశ్ రెడ్డి ఈ హత్యకు పాల్పడ్డాడని, ఇందులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
బెయిల్ పిటిషన్ల కొట్టివేత
హత్య ఘటనలో రాకేశ్ రెడ్డికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రాంబాబు సస్పెండుకు గురయ్యారు. ఈ హత్యకేసులో పరారీలో ఉన్న రాకేశ్ రెడ్డిని 2019 ఫిబ్రవరి 5న జూబ్లీహిల్స్ పోలీసులు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత రెండున్నరేళ్లుగా రాకేశ్ రెడ్డి జైలు జీవితం గడుపుతున్నారు. పలుమార్లు బెయిలుకు దరఖాస్తు చేసుకున్నా కోర్టు అనుమతించలేదు. చివరికి మానసిక స్థితి సరిగా లేదంటూ, బెయిలు కోరుతూ దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌నూ కోర్టు కొట్టివేసింది.
ఈ వ్యవహారంలో రాకేశ్ రెడ్డితోపాటు ఇస్లావత్ విశాల్, దున్నె శ్రీనివాస్, నేనావత్ నగేశ్, చీకట్ల సూర్యప్రకాశ్, మురుగుల కిషోర్, లక్ష్మిరెడ్డి, సుభాష్ చంద్రారెడ్డి, బండారు నర్సింహారెడ్డి అలియాస్ బీఎన్ రెడ్డి, కూర అంజిరెడ్డి, నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిలను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. హత్య జరిగిన 90 రోజుల్లో జూబ్లీహిల్స్ పోలీసులు 388 పేజీల ఛార్జిషీటును దాఖలు చేశారు. పక్కా శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను, సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది సాక్షులను కోర్టులో హాజరుపర్చినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
చిత్రహింసలు పెట్టారు
హనీట్రాప్ ద్వారా జయరాంను రప్పించి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన రాకేశ్ రెడ్డి.. ఆపై మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించాడని 23 పేజీల ఛార్జిషీట్లో పేర్కొన్నారు. 12 మంది నిందితులను, 73 మంది సాక్షుల పేర్లను చేర్చారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా చేర్చారు.
సంబంధిత కథనాలు: పారిశ్రామిక వేత్త అనుమానాస్పద మృతి