Constructions of Illegal Villas in Dundigal: మేడ్చల్ జిల్లా మల్లంపేటలో అక్రమ విల్లాల విక్రయంపై పోలీసులు నోటీసులు పంపారు. శ్రీలక్ష్మి శ్రీనివాస్ కనస్ట్రక్షన్ కంపెనీ పేరుతో బిల్డర్ విజయలక్ష్మి అక్రమంగా 260 విల్లాలు నిర్మించి విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలతో దుండిగల్ పోలీసులు నోటీసులిచ్చారు. ప్రస్తుతం బిల్డర్ అమెరికాలో ఉండగా.. వారంలోగా విచారణకు హాజరుకావాలని తెలిపారు. బఫర్ జోన్‌లో విల్లాలు నిర్మించినందుకు గతంలోనూ ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిపారుదల శాఖ అధికారుల ఫిర్యాదుతో ఒక కేసు, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో మరో కేసు తాజాగా నమోదు చేశారు. మరోవైపు వారం క్రితం చీటింగ్ కేసు కూడా పెట్టారు.
ఏం జరిగిందంటే..
2018 సంవత్సరానికి ముందు మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. 2018-19లో దుండిగల్ పురపాలక సంఘం ఏర్పడగా అందులో భాగమైంది. ఆ సమయంలో మల్లంపేటలో శ్రీలక్ష్మి శ్రీనివాస్ కనస్ట్రక్షన్ కంపెనీ పేరుతో బిల్డర్ విజయలక్ష్మి 15 ఎకరాల్లో విల్లాల నిర్మాణం మొదలుపెట్టింది. 65 విల్లాలకు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని.. అక్రమంగా మరో 260 కట్టారు. కత్వ చెరువు ఎఫ్‌టీఎల్‌లో రోడ్లు, బఫర్ జోన్‌లో కొన్ని విల్లాలు నిర్మించినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. సాగునీటి శాఖ ఈఈ విచారణ చేపట్టి, దుండిగల్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విల్లాల విక్రయంపై విజయలక్ష్మికి పోలీసులు నోటీసులు పంపారు.
కలెక్టర్ రంగప్రవేశంతో...
Constructions of Illegal Villas in Dundigal : పోలీసులు, పురపాలిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మేడ్చల్ కలెక్టర్ హారీశ్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన విచారణ చేయగా ఏడు విల్లాలు చెరువు బఫర్ జోన్‌లో ఉన్నట్లు తేలింది. వాటి కూల్చివేతలు చేపట్టగా స్థిరాస్తి సంస్థ కోర్టు నుంచి స్టే తెచ్చుకొంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరీష్, మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, డివిజనల్ పంచాయతీ అధికారి స్మిత తదితరులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు.
పంచాయతీ అనుమతులూ నకిలీవని, అప్పట్లో ఉన్న పంచాయతీ అధికారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించినట్లు తేల్చారు. తక్షణం వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు విల్లాలను సీజ్ చేశారు. ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఉన్న నలుగురు మున్సిపల్ కమిషనర్లపై శాఖాపరమైన చర్యలు, అంతకు ముందున్న పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్‌తో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిస్థితులతో విల్లాలు కొనుగోలు చేసిన అనేక మంది ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: swanky villas in dundigal: 'మల్లంపేటలో 260 అక్రమ విల్లాలు...'