పుట్టినరోజు జరుపుకోవడం అంటే ఓ సరదా. కానీ.. వారికి అదే చివరి రోజు అవుతుందని ఊహించలేదు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఆరిఫ్ది (18) జులై 1 న పుట్టినరోజు. తన పుట్టిన రోజును స్నేహితులు సులేమాన్ (19), ఈశ్వర్, గఫార్ లతో సరదాగా గడపటం కోసం ఆళ్లగడ్డ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని గన్లేరు జలాశయానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు మద్యం సేవించారు. మద్యం మత్తులో ఆరిఫ్, సులేమాన్ జలాశయం పరిధిలోని ఓ నీటి గుంతలోకి దిగారు.
మద్యం మత్తులో ఉన్న వీరు ఈదలేక నీట మునిగిపోయారు. గట్టున ఉన్న గఫార్, ఈశ్వర్లు వారు బయటకు వస్తారని చాలా సేపు వేచి చూశారు. అయితే.. ఎంతకీ రాకపోవడంతో ఆందోళనకు గురై ఆళ్లగడ్డ పట్టణం చేరుకొని గల్లంతైన యువకుల తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. గఫార్, ఈశ్వర్ల దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వారు ఆళ్లగడ్డ పోలీసులను ఆశ్రయించారు.
యువకులు గల్లంతైన జలాశయం రుద్రవరం పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెబుతూ.. పోలీసులు వారిని అక్కడికి పంపించారు. ఫిర్యాదు అందుకున్న రుద్రవరం ఎస్సై రామ్మోహన్ రెడ్డి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నీటి గుంట వద్ద గాలింపు చేపట్టారు. రాత్రి సమయం కావటంతో గాలింపు చర్యలను కొనసాగించలేక పోయారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలతో కూడిన కర్రలు ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మద్యం మత్తులో నలుగురు గొడవ పడినట్లు అక్కడ దృశ్యాలను బట్టి తెలుస్తోందని ఎస్సై తెలిపారు. శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Tragedy: నీట మునిగి బావ, బావమరిది మృతి