జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పూడూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పూడూరు గ్రామానికి ఆనుకొని రాజుల కాలం నాటి పొలం ఉంది. ఇదే గ్రామానికి చెందిన 63 మందికి పశువుల కొట్టం వేసుకోమని రాజు వంశీకులు చెప్పడంతో... అప్పటి నుంచి రైతులు పశువుల కొట్టాలను వేసుకున్నారు. ఇటీవల ఈ భూమిని పూడూరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పట్టా చేసుకున్నారు.
కోర్టు తీర్పు ఇచ్చినా...
విషయం తెలుసుకున్న బాధితులు... కోర్టును ఆశ్రయించారు. బాధితులకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. అందుకు అనుగుణంగా బాధితులు గుడిసెలు వేసేందుకు సిద్ధం కాగా... పట్టా చేసుకున్న వారు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో వీరభద్రుడు అక్కడిక్కకడే మృతి చెందగా... మరో వ్యక్తి వెంకటస్వామికి గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గద్వాల డీఎస్పీ యాదగిరి తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఇదీ చూడండి: SUICIDE: మొహర్రం వేడుకల్లో విషాదం.. పీరీల గుండంలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య