వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో కుమార్తెతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఈ ఘటనకు పాల్పడింది. గమనించిన స్థానికులు.. బాధితురాలి నుంచి పెట్రోల్ సీసాను తీసుకున్నారు. తన భర్త చనిపోతే రైతు ఆర్థిక సహాయం కింద వచ్చిన డబ్బులు డ్రా చేయనివ్వకుండా.. తహసీల్దార్ శ్రీనివాసరావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపింది.
ఘనాపూర్ గ్రామానికి చెందిన రైతు దండు సాయిలు ఆర్థిక ఇబ్బందులతో.. 2017లో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోగా 2019లో రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆ డబ్బు మృతుని భార్య రాములమ్మ(38), తహసీల్దార్ శ్రీనివాస రావు జాయింట్ ఖాతాలో జమయ్యాయి. ఆ నగదు డ్రా చేసుకునేందుకు 2019నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. పొంతన లేని సమాధానం చెబుతూ తమను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వాపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. తనకు కూడా ఆత్మహత్యే శరణ్యమని భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొంది.
వ్యవసాయంలో అప్పుల పాలై 2017లో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 2019లో నా భర్త పేరిట మా కుటుంబానికి రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బుతో ఇల్లు అయినా కట్టుకుందామని మూడేళ్లుగా తిరుగుతున్నాం. తహసీల్దార్ పట్టించుకోవడం లేదు. కూతురి పెళ్లి చేసి అప్పుల పాలయ్యాను. న్యాయం చేయాలని వేడుకుంటున్నాను. -రాములమ్మ, బాధితురాలు
ఇదీ చదవండి: Love Affair: శారీరకంగా ఒక్కటై.. పెళ్లనగానే ముఖం చాటేశాడు