ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన సురేంద్రకు వాణితో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి భావన (3), అక్షయ (10) ఇద్దరు కుమార్తెలు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆటో నడిపి సురేంద్ర ఇంటికి రాగా, భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు వాంతులు చేసుకోవడం గమనించాడు. ‘ఏమైంది’అని వారిని ప్రశ్నించగా ‘పురుగుల మందు తాగమని’ చెప్పడంతో హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా మారడంతో ఇద్దరు చిన్నారులను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తొలుత భావన, సాయంత్రం వాణి, చిన్నారి అక్షయ మృత్యు ఒడికి చేరారు.
సెల్‌ఫోనే కారణమా..?
సురేంద్ర కొన్నేళ్లుగా గ్రామంలోనే చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల వ్యాపారపరంగా దెబ్బతిన్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా..ఇంట్లో సెల్‌ఫోన్ చెడిపోవటంతో రిఫేర్ చేయించమని భర్తను అడిగిట్లు పోలీసులు వెల్లడించారు. భర్త స్పందించకపోవటం, ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోందన్నారు. ఈ మేరకు సీఐ హనీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా..,ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి : ప్రియురాలి బంధువుల దాడి.. ప్రియుడి ఆత్మహత్య