తనను చిత్రహింసలు పెడుతున్నారని.. రక్షించాలంటూ ఓ బాలుడు(12) చేసిన ఆక్రందనకు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి స్పందించారు. పోలీసుల సాయంతో దిల్లీ శివారులోని హరియాణా నుంచి ఆ చిన్నారిని రక్షించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
జిన్నారం మండలం నల్తూరు పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త తొమ్మిదేళ్ల కిందట మృతిచెందాడు. ఆమె 10 రోజుల క్రితం కుమారుడితో (12) కలిసి తిరుపతికి వెళ్తున్నానని చెప్పి ఓ వ్యక్తితో కలిసి హరియాణాకు వెళ్లిపోయింది. బాలుడు కొత్త మనుషుల మధ్య ఉండలేక, అక్కడి వారి భాష అర్థంకాక ఇంటికి వెళ్లిపోదామంటూ మారాం చేశాడు. వారు చిన్నారిని కొట్టడంతో పాటు బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లేవారు.
తీవ్ర ఆవేదనకు గురైన బాలుడు ఇక్కడి తన స్నేహితులకు ఫోన్‌చేసి ఏడుస్తూ తన పరిస్థితిని వివరించాడు. ఇది తెలిసిన బాలుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి చెప్పి వాపోయారు. ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ సూచనల మేరకు జిన్నారం ఎస్సై సమియజమా, కానిస్టేబుల్‌తోపాటు సర్పంచి, ఉప సర్పంచి అక్కడకు వెళ్లి సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా బాలుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. ఆ చిన్నారి తల్లితో ఉండటానికి ససేమిరా అనడంతో అతడిని ఇక్కడకు తీసుకొచ్చేశారు. చిన్నారిని కాపాడిన పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు.
ఇదీ చదవండి:భూ తగాదా... అన్నను నరికి చంపిన తమ్ముడు