MLA Gopinath PA attacked a woman: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్.. అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. కత్తితో ఓ వివాహిత గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఈ విషయంపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను వివరణ కోరగా.. విజయ్ తన పీఏ కాదని.. గతంలో ఓ కార్పొరేటర్ వద్ద పని చేశాడని చెప్పడం గమనార్హం.
పంజాగుట్టలో మహిళ గొంతు కోసిన ఘటనపై తెరాస నేత విజయ్ స్పందించారు. మహిళపై హత్యాయత్నం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నానని చెప్పారు. తెరాసలో చురుగ్గా ఉంటున్నానని తనపై కుట్ర చేశారని ఆరోపించారు. గతంలో బాబా ఫసియుద్దిన్ వద్ద ఉన్నానని.. బాబా ఫసియుద్దిన్ మోసాలు తెలిసి దూరంగా ఉన్నానని విజయ్ అన్నారు.
గతంలో బాబా ఫసియుద్దిన్.. ఓ మహిళతో తనపై కేసు పెట్టించారని తెలిపారు. పోలీస్ దర్యాప్తులో నిజాలు తేలుతాయని చెప్పారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. బాధిత మహిళ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమని తెలియజేశారు. వారం రోజుల క్రితం బాధిత మహిళ భర్త తనను కలిశారని పేర్కొన్నారు. ట్రాప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సూరజ్ చెప్పారని తెరాస నేత విజయ్ వెల్లడించారు.