Minister Indra Karan On Minor Girl Rape : తప్పు చేసిన వారెంతటి వారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర దేవాదాయ, న్యాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆడపిల్లల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర సర్కార్ మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ.. వారి సంక్షేమానికి అనేక రకాల స్కీంలు తీసుకొస్తోందని చెప్పారు.
Nirmal Municipal Vice Chairman Suspended :నిర్మల్ జిల్లాకేంద్రంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు వస్తోన్న వార్తలపై మంత్రి ఇంద్రకరణ్ స్పందించారు. ఆమెను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. తక్షణమే ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్న మంత్రి.. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు.
"మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను. అందరం చర్చించి.. విచారణ చేసి.. వైస్ ఛైర్మన్ సాజిద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. ఇవాళ్టి నుంచే ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతానికి ఆరోపణలపైనే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి.. కోర్టు విచారణ చేపట్టిన తర్వాత నిజానిజాలేంటో పూర్తిగా తెలుస్తాయి."
- ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి
అసలేం జరిగిందంటే..
Minor Girl Rape in Nirmal : నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ బాలిక పట్టణ పోలీసులను ఆశ్రయించింది. తనపై కొన్నిరోజులుగా లైంగిక దాడికి పాల్పడినట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు మున్సిపల్ వైస్ ఛైర్మన్ సాజిద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
భాజపా ఆందోళన..
Minor Girl Rape in Nirmal News : మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ సాజిద్‌ను పదవీ నుంచి తొలగించాలని జిల్లా భాజపా నేతలు ఆందోళనకు దిగారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి.. ఆఫీసులోకి దూసుకెళ్లారు. కమిషనర్ ఛాంబర్ ఎదుట అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్‌కు.. భాజపా నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
బాధితురాలికి న్యాయం చేయాలి..
విషయం తెలుసుకున్న పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చూశారు. అనంతరం బాలికకు న్యాయం చేయాలని భాజపా నేతలు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ను పదవీ నుంచి బర్తరఫ్ చేయాలని విన్నవించారు.