మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు దంపతులను అరెస్ట్ చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. సింగరేణి ప్రాంతంలో తిరిగి కార్యకలాపాలు చేపట్టేందుకు సికాస పునర్ నిర్మాణానికి వ్యూహం రచించిన.. మావోయిస్ట్ సభ్యులు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్, అతని భార్య విజయలక్ష్మిలను అరెస్ట్ చేశారు.
సింగరేణి కార్మిక సంఘం(సికాస) పునర్ నిర్మాణానికి క్యాతన్పల్లిలోని తెలంగాణ విద్యావంతుల వేదిక మాజీ అధ్యక్షుడు, సికాస మాజీ జనరల్ సెక్రటరీ గురిజాల రవీందర్ రావు.. తమ ఇంట్లో 20 రోజులు అభయ్, విజయలక్ష్మిలకు ఆశ్రయం ఇచ్చినట్లు సీపీ చెప్పారు.
పక్కా సమాచారంతో ఆదివారం గురిజాల ఇంట్లో సోదాలు నిర్వహించి.. విజయవాడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడు ఫోన్లు, ఓ ల్యాప్ టాప్, రెండు మెమొరీ కార్డులు, పుస్తకాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామని సీపీ సత్యనారాయణ వివరించారు.
ఇదీ చూడండి : 'ఎన్నికల్లో అక్రమాలు జరిగాయ్... సీబీఐతో దర్యాప్తు చేయించండి'