Man Suicide in Sangareddy : సంతోషంగా నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న యువకుడు.. ఆ శుభకార్యం జరగాల్సిన రోజే అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. జోగిపేట ఎస్సై సామ్యానాయక్, కుటుంబ సభ్యుల వివరాలు.. మెదక్ జిల్లా టేక్మాల్‌కు చెందిన గుంజి బాలరాజ్ (25), ఆయన సోదరుడు శంకర్ ఏడాదిగా అదే మండలంలోని పల్వంచ సోలార్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. బాలరాజ్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆదివారం అర్ధరాత్రి వరకు విధి నిర్వహణలోనే ఉన్న బాలరాజ్ సోమవారం ఉదయానికల్లా సంగారెడ్డి జిల్లా అందోలు మండలం దానంపల్లి శివారులో ఓ విద్యుత్ స్తంభానికి ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని బోరుగా విలపించారు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొందని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి సోదరుడు శంకర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
అధికారితో గొడవే కారణమా? : విధి నిర్వహణలో భాగంగా సోలార్ ప్లాంట్‌లో పనిచేస్తున్న బాలరాజ్‌కు.. అదే ప్లాంటులో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారితో వారం రోజుల క్రితం గొడవ చోటుచేసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో హత్య చేసి స్తంభానికి వేలాడదీసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ఉద్దేశం ఉంటే.. నిశ్చితార్థానికి తానే స్వయంగా ఏర్పాట్లు చేసుకునేవాడు కాదని చెబుతున్నారు. నిత్యం తిరిగే ప్రాంతంలో కాకుండా.. మరో చోటుకు వెళ్లి అంతెత్తు స్తంభానికి ఉరేసుకున్న తీరుపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి :