Matrimonial fraud in Hyderabad : కొండాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవాలనుకుంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన శివశంకర్‌తో ఆమెకు వివాహం నిశ్చయమైంది. సదరు యువతి తల్లిదండ్రులు శివశంకర్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫై చేశారు. అతడు పెళ్లి పేరుతో చాలా మందిని మోసం చేసి వారి దగ్గర నగలు, డబ్బు దోచేశాడనే విషయం తెలిసి ఆ యువతి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అతడిపై ఇంతకుముందే గచ్చిబౌలి, రామచంద్రాపురం, ఏపీలోని గుంటూరు, విజయవాడలో కేసులు నమోదయ్యాయని తెలుసుకున్నారు. ఇటీవలే ఉద్యోగం పేరిట ముగ్గురిని మోసం చేసి వారి నుంచి డబ్బు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి పోలీసుల సాయంతో శివశంకర్‌ను వైజాగ్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు.
"మ్యాట్రిమోనీలో మహిళల వివరాలు సేకరిస్తాడు. నెమ్మదిగా వారితో మాట కలిపి పెళ్లి చేసుకుంటానని మాయ చేస్తాడు. కొన్నిరోజులు వారితో కలిసి తిరుగుతాడు. ఏదో అత్యవసరం అని అబద్ధం చెప్పి వారి నుంచి నగదుల, డబ్బు తీసుకుంటాడు. ఇక అక్కణ్నుంచి ఉడాయిస్తాడు. మరో మహిళకు ఇలాగే వలపు వల వేస్తాడు. మొదటి వ్యక్తి నుంచి దోచేసిన నగలను.. మరో మహిళ బ్యాంకు ఖాతాలో పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటాడు. ఆ డబ్బుతో పారిపోతాడు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి ఐదుగురు బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయి. బాధితుల ఫిర్యాదుతో ఇవాళ వైజాగ్‌లో శివశంకర్‌ను అరెస్టు చేశాం. ఇంకా ఎవరైనా అతడి బారిన పడి మోసపోతే ధైర్యంగా వచ్చి మాకు ఫిర్యాదు చేయాలి." రఘునందన్ రావు, మాదాపూర్ ఏసీపీ