మహిళను వేధించిన కేసులో ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన భరత్.. తన ఇంటికి సమీపంలో నివసించే మహిళతో చనువు పెంచుకున్నాడు. స్నేహంగా మెలిగి కోరిక తీర్చమని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించడం వల్ల కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఆమెను వేధింపులకు గురి చేశాడు.
'ప్రైవేట్ నెంబర్స్' అనే యాప్ ద్వారా మహిళకు వివిధ నెంబర్లతో ఫోన్లు చేసి... ఆమెకు మరికొందరితో సంబంధాలు ఉన్నాయని భర్తకు ఈ విషయం తెలియజేస్తానంటూ బెదిరించాడు. ఒక దశలో బాధితురాలి భర్తకు కూడా ఫోన్ చేసి అసభ్యకర పదజాలంతో దూషించాడు. దీంతో బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: నా భర్తకు వేరే పెళ్లి చేస్తున్నారు... నాకే కావాలి!