భవన నిర్మాణదారులకు బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బసంత రాజ్ అనే వ్యక్తిని కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు లక్షల రూపాయల నగదు, ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని అడ్డగుట్ట సొసైటీలో నివాసముంటున్న బసంత రాజ్ పదో తరగతి చదువుకున్నాడు. కొత్తగా నిర్మించే భవనాలలో లోటుపాట్లను తెలుసుకుని మానవహక్కుల సంఘం, పర్యావరణ సంరక్షణ అధికారినంటూ.. నిర్మాణదారులను బెదిరించేవాడు. భయపడనివారిపై జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేయడం, బ్యాంకుల్లో రుణాలు రాకుండా చేసేవాడు.
ఈ క్రమంలో అడ్డగుట్టలో భవనాన్ని నిర్మిస్తోన్న వీరయ్య అనే వ్యక్తిని బెదిరించడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు డబ్బు తీసుకుంటున్న సమయంలో నిందితున్ని, అతని కుమారున్ని అరెస్ట్ చేశారు. బెదిరింపులకు పాల్పడే సమయంలో పలువురు రాజకీయ నాయకులు, స్థానిక విలేకరులు అతనికి మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై 164 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'మా గ్రామంలో భాజపా నాయకులకు ప్రవేశం లేదు'