మలక్‌పేట్‌లోని ఆంధ్రాబ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఇంజినీర్ భార్య గొల్ల పద్మావతి (74) అనే వృద్ధురాలిని కత్తితో బెదిరించి బంగారు గొలుసు, గాజులు దోచుకున్న అగంతుకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన ఓ యువతిని అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రమేష్ తెలిపారు.
కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో గొల్ల పద్మావతి అనే వృద్ధురాలు మలక్‌పేట్‌లోని ఆంధ్రాబ్యాంక్ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆ విషయాన్ని గమనించిన శాలివాహననగర్‌లో ఉండే ప్రైవేటు ఉద్యోగి తాండ్ర రాజేష్, అదే ప్రాంతంలో అద్దెకుంటున్న తన స్నేహితురాలు రజినితో కలిసి దోపిడీకి పథకం వేశారు. వారిద్దరూ గత నెల 29న గోడదూకి ఇంట్లో దూరారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తితో బెదిరించి మెడలో ఉన్న 8 తులాల బంగారు గొలుసు, 5 తులాల చేతి గాజులు దోచుకుని పారిపోయారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రాజేశ్‌పై గతంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసులు ఉన్నట్లు డీసీపీ రమేష్ తెలిపారు.
ఇదీ చదవండి: సన్ ఇంటర్నేషనల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, లెక్చరర్ అరెస్ట్