municipal councillor murder in mahabubabad: మహబూబాబాద్‌లో కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు. ఎంపీ పర్యటనలో పాల్గొని.. తిరిగి ఇంటికి వెళ్తుండగా మాటువేసి.. గొడ్డలితో నరికిచంపారు. మహబూబాబాద్ ఎనిమిదో వార్డు కౌన్సిలర్ బానోత్ రవి... ఉదయం ఎంపీ మలోత్ కవిత పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా... పత్తిపాకలో దుండగులు ట్రాక్టర్‌ను అడ్డుపెట్టారు.
అప్పటికే కారులో వచ్చి, కాచుకుని ఉన్న దుండగులు రవిని గొడ్డలితో నరికి, అక్కడి నుంచి పారిపోయారు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమివ్వగా.. వారు రక్తపుమడుగులో ఉన్న కౌన్సిలర్‌ను హుటాహుటిన మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తుండగా.. రవి ప్రాణాలు విడిచారు.
మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బానోత్ రవి... కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం.. తెరాసలో చేరారు. రవి హత్య గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, తండావాసులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. రవికి భార్య పూజతోపాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కౌన్సిలర్ రవి హత్య గురించి తెలుసుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని.. కుటుంబసభ్యులను ఓదార్చారు.
కౌన్సిలర్ హత్యకు రాజకీయాలతో సంబంధంలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వ్యాపారకక్షలతోనే రవిని హత్యచేశారని మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. ఈ కేసులో మహబూబాబాద్ పట్టణంలోని మంగలి కాలానీకి చెందిన భూక్యా విజయ్ ( 34 ), బాబునాయక్ తండాకు చెందిన భూక్యా అరుణ్ ( 20 ) అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఉపయోగించిన ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవీ చదవండి :