హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో దొంగతనానికి గురైన ఖరీదైన కారు ఇంకా లభించలేదు. ఆ కారు కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి అపహరించాడని గుర్తించారు. నిందితున్ని పట్టుకునేందుకు రాజస్థాన్‌కు వెళ్లిన పోలీసులకు చిక్కుకుండా పారిపోతుండడంతో చేసేదిలేక వెనుదిరిగి వచ్చినట్లు సమాచారం. బెంగుళూరుకు చెందిన సినీ నిర్మాత, వ్యాపారవేత్త అయిన మంజునాథ్ సొంత పని నిమిత్తం హైదరాబాద్‌కు గత జనవరి 22న నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో బసచేశాడు. అదే నెల 26న నగరంలో పని ముగించుకుని హోటల్‌కు తిరిగి వచ్చి కారును పార్కింగ్ చేశారు. మరునాడు పార్కింగ్ చేసిన కారు వద్దకు వెళ్లగా అది కనిపించకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కారులో విలువైన భూమి పత్రాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు సాంకేతిక పరిజ్ఞానంతో కారు తాళం తీసి చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ కారును చోరీ చేసిన రెండు రోజుల తర్వాత ఔటర్ టోల్ గేట్ నుంచి బయటకు వెళ్లినట్లు.. ఆ తర్వాత ఆ కారును కూకట్‌పల్లిలో రెండు రోజులపాటు నిలిపి ఉంచినట్లుగా కూడా పోలీసులు గమనించారు. పోలీసులు తనను అనుసరించడంలేదని నిర్ధారించుకున్న నిందితుడు నేరుగా రాజస్థాన్‌కు వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు. నిందితుని కోసం రాజస్థాన్‌లో అతని చిరునామా ఉన్న చోటికి వెళ్లినప్పటికి చిక్కలేదు. దీంతో పోలీసులు వెనుతిరిగి వచ్చినట్లుగా సమాచారం.
ఇదీ చదవండి: Fake Seeds: రూ.13 కోట్ల విలువైన నకిలీ మిరప విత్తనాలు స్వాధీనం